Harish Rao | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీ పక్కనే వెళ్తున్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.
అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు.
వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని, స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీశారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి పంపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.