Harish Rao | సిద్దిపేట : తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్న రేవంత్‌పై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పుల, పన్నుల భారం ఎక్కువైపోయిందన్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు. అసలే ఆర్థిక మాంద్యం.. వరసగా రెండో నెల డిఫ్లేషన్‌లో ఉంది.. తెలంగాణలో వరసగా ఇది రెండో సారి. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నది. గత నెల, ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రెండు వేల కోట్ల భారం పడిందన్నారు.
గతంలో రూ. 100గా ఉన్న సర్వీస్ టాక్స్‌ను ఇప్పుడు రూ. 200లు చేశారు. వెహికిల్ సర్వీస్ టాక్స్ రూ. 400 నుంచి వన్ పర్సంటేజ్‌కు పెంచారు. రోడ్ టాక్స్‌నూ పెంచారు. మోటార్ సైకిల్ టాక్స్‌ను నాలుగైదు వేలకు పెంచారు. పెనాల్టీల పేరిట గత నెల వెయ్యి కోట్లు, ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్ల భారం మోపారు. గతంలో రూ. 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. గతేడాది రూ. 6900 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. బడ్జెట్ రూ. 8000 కోట్లు అంచనా వేశారు.. ఇదేలా సాధ్యం అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
అసెంబ్లీలో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నుల పెంపు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్టులో ట్యాక్స్‌లు రద్దు చేసి.. పేదలకు సాయం చేశామన్నారు. పేదలపై ఈ పన్నుల భారాన్ని ఈ ప్రభుత్వం తొలగించాలి. రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. మేము పన్నులు తొలగిస్తే.. మీరు పన్నులు వేస్తున్నారు.. ఇదేనా మార్పు. ఆర్ అండ్ బి, పీఆర్లో అన్యూటి మోడల్లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారు. ప్రజలపై దొడ్డి దారిన భారం వేసి ఆ అప్పులు కడతారు.. దీన్ని ఉపసంహరించుకోవాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
పండగలు వస్తే పాపం.. పండగకు ముందు వారం, పండగ తరువాత వారం ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూ చేసింది. మద్యం ధరలు రెండు సార్లు పెంచారు. ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తారట.. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రెపో మాపో పెంచుతారట. పేద ప్రజల రక్తమాంసాలు పీల్చుతారా..? ఢిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. నీ ఆర్ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.