Harish Rao | సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి, సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతుల వడ్లు దళారుల పాలయ్యాయి. ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబందు ప్రభుత్వం అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాఘవపూర్ గ్రామంలో 4-5 వేల క్వింటాళ్ల వడ్లు ఇప్పటికే స్థానిక రైస్ మిల్లులకు, మధ్య దళారులకు అమ్ముకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అబ్దుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ల వడ్లు కల్లంలో పోసి నెల రోజులు ఎదురు చూసి రూ. 1900కు అమ్ముకున్నాడు. అంటే క్వింటాల్‌కి రూ. 420 నష్టం. కాంగ్రెస్ ఇస్తానన్నా బోనస్‌తో కలిపితే రూ. 81,000 ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల నష్టం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నో మాటలు చెప్పారు కనీసం ఒక్క మంత్రి అయినా వడ్ల కల్లాలకు పోయి ఏంటి పరిస్థితి అని చూస్తున్నారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బోనస్ ఇవ్వకుండా, వడ్లను కొనకుండా రైతులను అన్ని విధాలుగా నష్టం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందు ప్రభుత్వం. రైతుల ఉసురు పోసుకుంటున్నావు, కన్నీళ్లు పెట్టిస్తున్నావు. వడ్లు కొంటాడో కొనడో, కొంటే డబ్బులు వస్తాయో రావో అనే భయం రైతులకు పట్టుకుంది. మొదట రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచు, తక్షణమే 48 గంటల్లో కొన్న వడ్లకు డబ్బులు చెలించి రైతులకు కొంత ఊరటనివ్వు అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు.
కలుపు కాకముందే రైతు బంధు పైసలు ఇచ్చేది కేసీఆర్, సకాలంలో ఎరువులందించి పంట కొయ్యకముందే గన్నీబ్యాగులు తెచ్చి మిల్లులకు టై అప్ చేసి పంటను కొనేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రేవంత్ వచ్చాక రైతు బందు ఎగబెట్టిండు, బోనస్ బోగస్ చేసిండు, వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి చేసిండు. రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు రాఘవపూర్‌లో సగం మందికి మాఫినే కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 శాతం వడ్లు రైతులు దళారులకు అమ్ముకున్నారు. ఇప్పటికైనా మిల్లులకు టై అప్ చేసి మద్దతు ధరకి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
వానాకాలం, యాసంగి పంటలకు గాను ప్రభుత్వం రైతులకు బాకీపడ్డ రైతు బంధు 7500+7500 మొత్తం 15 వేలు వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నం. రుణమాఫీ పైన నీ ఒట్లకు మొక్కాలే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో రెండే మంచిగా ఉంటాయి ఒకటి ఒట్లు రెండు తిట్లు. ఎవరైనా ఏదైనా అడిగితే తిట్టుడు పెడుతాడు నమ్మతులేరు అనుకో దేవుని మీద ఒట్లు పెడుతాడు. పంద్రాగష్టు వరకు రుణమాఫీ చేస్తా అని కనిపించిన ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టిండు, ఓట్లు డబ్బాలు వేసుకున్నాక మోసం చేసాడని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Telangana | తెలంగాణలో నిలిచిపోయిన మద్యం సరఫరా.. కారణమిదే..!
KTR | నువ్వు ఎప్పుడు జైలుకు పోతావో చూస్కో.. మంత్రి పొంగులేటికి కేటీఆర్ వార్నింగ్