Harish Rao | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంపై కేసీఆర్ ముద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా.. రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడు కనిపించే టీ హబ్ గాని, స్టీల్ బ్రిడ్జి గాని కేసీఆర్ గారు కట్టింది కాదా.. అని హరీశ్‌రావు అడిగారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 100 కోట్లతో రేవంత్ రెడ్డి కొత్త నివాసం నిర్మిస్తున్నాడు. కేసీఆర్, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌లో ఎస్టీపీలు కట్టారు. ఈరోజు హైదరాబాద్‌లో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ప్రణాళిక చేసి ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయం అందించడానికి నన్ను పిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల బస్తీలో నీళ్లు వచ్చి ఇల్లు మునిగిపోయాయి అని చెప్పారు. నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల హైదరాబాదులో వరదలు వచ్చాయి. వరదలకు కారణం రేవంత్ రెడ్డినే అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఊకదంపుడు ఉపన్యాసమే తప్ప ఏమి లేదు.. అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చావా రేవంత్ రెడ్డి? గాలి మాటలు తప్ప ఆరు గ్యారెంటీల అమలు గురించి మాట్లాడడు ముఖ్యమంత్రి. పది రోజులు అసెంబ్లీ పెట్టు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతుబంధు మీద చర్చిద్దాం అంటే ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి పారిపోయాడు ఈ ముఖ్యమంత్రి. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయడు ఈ ముఖ్యమంత్రి. పేద ప్రజల కన్నీళ్లు తుడిచే ఒక్క ప్రణాళికైనా ఈ ప్రభుత్వానికి ఉందా? కామారెడ్డిలో వరద బాధితులకు ఒక రూపాయి అయినా విడుదల చేశారా? వరదల్లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించారా? మందిని తొక్కడం మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం అని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తారా? 3,600 కోట్ల బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పాడు.. బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్న. 8,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా వచ్చినా కష్టం వచ్చినా 2,508 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. ఈ రెండేండ్లు రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించింది బీఆర్ఎస్ పార్టీ. పోయిన నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు విడుదల చేసిన బిల్లులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. పిల్లల చదువులు ముఖ్యమా? లేక కాంట్రాక్టర్ల కమిషన్ల ముఖ్యమా? ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.