Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై జరిగిన లఘ చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్తు బకాయిలు చెల్లించని వాటిలో తొలి స్థానంలో సిద్దిపేట 61.37 శాతం, రెండో స్థానంలో గజ్వేల్ 50.29 శాతం, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం బకాయిలు ఉన్నాయని తెలిపారు.‘సిద్దిపేటలో హరీశ్‌రావు, గజ్వేల్‌లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్‌లో అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్తు కోతలే లేవన్నట్టు జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నడైనా రైతులు రోడ్డెకారా? అని జగదీశ్‌రెడ్డి అడిగారు.
కామారెడ్డిలో సెప్టెంబర్ 1న సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కారు. కరెంట్ సరిగా లేక పంటలు దకక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్తు సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది మరణించారు. ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకున్నది. కానీ ఆనాటి సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు.
ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకూ ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను హరీశ్‌రావు తప్పుబట్టారు. 2004లో తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో పెట్టి, రాష్ట్రపతి నోట చెప్పి కూడా ఆ తర్వాత కాంగ్రెస్ మోసం చేసిందని గుర్తుచేశారు. ఆ పరిస్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. తాము టీడీపీతో, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నా.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఈ రాష్ట్ర, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కృషితోనే తెలంగాణ వచ్చిందని తేల్చి చెప్పారు. సీట్లు, ఓట్ల కంటే రాజకీయ వ్యవస్థను ఒప్పించి, రాష్ర్టాన్ని సాధించాలనే వ్యూహంతోనే పొత్తులు పెట్టుకున్నామని వివరించారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా పదవుల కోసం పార్టీ మారారని ఆరోపించారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్ట్ సిటీలో కాంగ్రెస్ గెలవలేదని అక్కసుతోనే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ మూడు నియోజకవర్గాల ప్రజలను బద్నాం చేయటం సబబు కాదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను, ప్రజలను రేవంత్‌రెడ్డి అవమానపర్చారని, ఇది సరికాదని వెల్లడించారు.