Harish Rao | హైదరాబాద్ : టీజీ ఎప్ సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎప్‌సెట్ ఫలితాలను తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి విడుదల చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పోటీ పరీక్షల ఫలితాలను తమ ఇంటి నుండి విడుదల చేయలేదు అని ఆయన గుర్తు చేశారు. అయితే కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి లేక జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి పాలన కొనసాగించే ఈ ముఖ్యమంత్రి, అటు పోలీసులను పని చేసుకోనివ్వడం లేదు, ఇటు అధికారులను పని చేయనివ్వడం లేదు. సెక్రటేరియట్ మొఖం చూడడం లేదు. ప్రజా పాలన అంటే ఇదేనా?? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎప్‌సెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.