Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు అధఃపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా అని సీఎంను హరీశ్‌రావు హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
సీఎం పదవిని అందరం గౌరవిస్తాం. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతతో మాట్లాడుతాడు, నిజాలు మాట్లాడుతాడు అని విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన సీఎం రాజ్యాంగబద్దమైన పదవిలో అంటూ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడు. కుక్క తోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో ఉప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అబద్దాలు మాట్లాడుతున్నాడు. తప్పులు, అబద్దాలు మాట్లాడినప్పుడు పాఠకులకు ప్రజలకు వాస్తవాలు చేరవేసే బాధ్యత మీడియాపై ఉంది. నిజాలను ప్రసారం చేసే గొప్పతనం మీడియాకు ఉంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
నిన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారు. వ్యక్తలు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర హక్కులు ముఖ్యం. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. తెలంగాణను తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఈ రాష్ట్రాన్ని పదేండ్లు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుంది. రాజకీయాలు కేంద్రంగా, బురదజల్లే విధంగా అబద్దాలు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి నిజాలు ప్రజలకు అందించాలని మీడియాను కోరుతున్నాను అని హరీశ్‌రావు తెలిపారు.
నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్లో ప్రజెంటేషన్ అధికారిక హోదాలో ఇచ్చింది. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచారు. సచివాలయం నుంచి, ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చిన అధికారులు అక్కడి ప్రజెంటేషన్‌లో ఉన్నారు. మిగతా పార్టీలను పిలవాలి కదా..? నిన్న పీపీటీ హైదరాబాద్‌లో ఇచ్చినట్లు లేదు.. అమరావతిలో ఇచ్చినట్లు ఉంది. అది చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా..? చంద్రబాబు పంపిండా..? అనే అనుమానం కలుగుతుంది. బనకచర్లను ఆపాలనే చిత్తశుద్ధి ఉంటే ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరులకు రాసిన లేఖలు, బనకచర్లను ముందుకు తీసుకుపోతున్న విధానం చూపించాలి. దాని గురించి ఎక్కడ పీపీటీలో చూపించలేదు. దానికి స్థానం దొరకలేదు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, తుమ్మిళ్ల లిఫ్ట్‌ను బాబు అడ్డుకున్నారు. వాటిని ఎందుకు పీపీటీలో చూపించలేదు అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
బనచర్ల కట్టే బాబేమో బంగారు లాగా కనబడుతుంది రేవంత్ రెడ్డికి. బనకచర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ సచ్చిన పాములాగా కనబడుతుంది. సచ్చిన పాము అయితే కలలో కూడా బీఆర్ఎస్ను ఎందుకు కలవరిస్తున్నావు. కేసీఆర్ పేరెత్తకుండా ఒక్క సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడు. నిద్రలో కూడా నీకు గులాంబీ జెండాను కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర ఏండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అనేక శాసనసభల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంతమాత్రాన కాంగ్రెస్ పార్టీ సచ్చిన పాము అవుతందా..? నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు అయ్యింది. సచ్చినపాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు కాదు రాహుల్ గాంధీకి చెప్పుకో. నీవు సీఎం అయ్యాక నీ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచాం. అహంకారంతో మాట్లాడితే అధఃపాతాళానికి ప్రజలు తొక్కేస్తారు బిడ్డా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు.