Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మగశిశువును కుక్కలు పీక్కుతిన్నాయన్న వార్త చదివాక తన మనసు కలిచివేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత హృదయ విదారక విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గం.. కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరమని హరీశ్‌రావు ఆవేదన చెందారు.
కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటుకు మరణాలు అనే వార్తలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయి. రాష్ట్రంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని ముందు నుంచి హెచ్చరించినప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండింది. నియంత్రణ పక్కన బెడితే, కనీసం యాంటీ రేబిస్ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. మున్సిపాలిటీలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేక మనుషుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటే అందులో 10 లక్షలకు పైగా కుక్కలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయంటే వీధి కుక్కల నియంత్రణలలో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయినా, వాటి సంతాన నియంత్రణ ఆపరేషన్లకు (స్టెరిలైజేషన్) ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు హరీశ్‌రావు.
కుక్క కాటుకు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి మందలించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. రాష్ట్రంలో కుక్కకాట్ల నివారణకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని హైకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యచరణ ప్రకటించలేదు. దేశంలో కుక్కకాటుల నివారణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత మూడు సంవత్సరాలుగా ఒక కుక్క కాటు మరణం సంభవించని గోవా లాంటి రాష్ట్రాల నియంత్రణ పద్ధతులను అధ్యయనం చేయాలి. అదేవిధంగా గతంలో హర్యానా, పంజాబ్ హైకోర్టుల తీర్పును దృష్టిలో పెట్టుకొని కుక్క కాటుతో మరణించిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలి. యాంటీ రేబీస్ ఇంజక్షన్లు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. హైకోర్టు సూచన మేరకు రాష్ట్రం లో వీధి కుక్కల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాలి. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా గ్రామాల్లో, పట్టణాల్లో క్రమం తప్పకుండా స్టెరిలైజేషన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు.. కమలా హారిస్‌పై కేటీఆర్ ట్వీట్
Harish Rao | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది : హరీశ్‌రావు
KTR | కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతున్నట్లు అనిపిస్తోంది : కేటీఆర్