Harish Rao | సిద్దిపేట : ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి హరీశ్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న ఆ చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారు.
సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఓ చిన్నారి మాట్లాడుతూ.. నా పేరు సాత్విక.. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం.. నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అప్పట్నుంచి మా అమ్మే నన్ను మంచిగా చూసుకుంటుంది. కానీ నేనే ఊరికే తిడుతుండేదాన్ని. నేను ఇప్పట్నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకువస్తాను. ధన్యవాదాలు అని ఆ చిన్నారి వలవలా ఏడ్చేసింది.
ఇక ఆ చిన్నారి చెప్పిన మాటలకు.. హరీశ్‌రావు కూడా కన్నీరు పెట్టుకున్నారు. సాత్వికను దగ్గరకు చేరదీసి ఏడ్వొద్దని చెప్పారు. తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ పాపను ఓదార్చారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. అమ్మనాన్నల గౌరవాన్ని తమకు అర్థమయ్యేట్టు చెప్పి, వాళ్ల విలువ తెలిసేటట్టు చెప్పి, మనందరికి కళ్లు తెరిపించినటువంటి పిల్లలను చప్పట్లతో అభినందించాలి. ఈ పిల్లల బాధలు విని ప్రతి ఒక్కరూ రియలైజ్ కావాలి. తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటో అర్థమైందని అనుకుంటున్నా.. ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి.. జీవితాంతం తల్లిదండ్రులు, టీచర్లను ప్రేమించాలి. అమ్మ కంటే మంచి కోరుకునే వారు ఈ భూమ్మీద ఎవరూ ఉండరు. ఫోన్లు చూస్తూ టైమ్ వేస్ట్ చేయొద్దు. అమ్మ మాట వినండి.. గౌరవించండి.. ఇవాళ్టి నుంచి మీ అందరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు
తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని.. చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్… pic.twitter.com/49x2DokEC4
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025