హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నడని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను కూడా ఆయన దగా చేస్తున్నడని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ హరీశ్‌రావు ఈ విమర్శలు చేశారు. ‘రేవంత్‌రెడ్డీ నీ ప్రాధాన్యత ఏంది..? ప్రజల మేలా.. లేదంటే కమీషన్ల కక్కుర్తా..?’ అని ప్రశ్నించారు.
ఇంకా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘కొడంగల్-నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.4,350 కోట్ల ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తరట. అయితే ఈ లిఫ్టును బీమాలో పెడుతరట. ఇప్పటికే బీమాలోని 20 టీఎంసీల నీటితో 2.10 లక్షల ఎకరాలకు నీళ్లు సరిపోతలేవు. ఇప్పుడు అండ్లకెల్లే మళ్ల ఏడు టీఎంసీల నీటిని తోడుతరట. ఇదేమన్న అయ్యే పనేనా..? అట్ల జేస్తే అటు బీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగమైతయ్. బీమా ప్రాజెక్టులోని 20 టీఎంసీల నీటితోని ఒక టీఎంసీకి 10 వేల ఎకరాల చొప్పున 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతదని మనం అంటున్నం. కానీ రేవంత్‌రెడ్డి ఏమంటున్నడు.. ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు నీళ్లు పారుతయని అంటున్నడు. బుర్ర ఉన్నోడు ఎవడన్న ఇట్ల మాట్లాడుతడా..? రేపు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఇదే వాదన వినిపిస్తే తెలంగాణకు రావాల్సిన నీటి వాటా తగ్గిపోదా..?’ అని నిలదీశారు.
‘కాలువ తవ్వితే పాలమూరు నుంచి కరివెన రిజర్వాయర్ ద్వారా మక్తల్‌లో 66,963 ఎకరాలకు సాగునీరు అందుతది. కానీ కాలువ తవ్వకుండా లిఫ్టు పెడుతున్నరు. మరె లిఫ్టు ద్వారా ఇచ్చే సాగునీరు ఎంతా అంటే 30 వేల ఎకరాలు. మరె ఎందుకు లిఫ్టులు. లిఫ్టులెందుకు..? పంపులు ఎందుకు..? కరెంటు బిల్లు ఎందుకు..? నారాయణపేటకు కూడా పాలమూరు నుంచి కాలువ తవ్వితే గ్రావిటీ ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది. కానీ లిఫ్టు పెట్టి 16 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తరట. ఇక కాలువ తవ్వితే గ్రావిటీ ద్వారా పాలమూరు నుంచి కొడంగల్‌కు 63 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండంగ.. కాలువ తవ్వకుంట లిప్టు పెట్టి 53 వేల ఎకరాలకు నీళ్లు ఇస్త అంటున్నడు. అది కూడా మూడో లిఫ్టు ద్వారా. ఇది కొడంగల్ ప్రజలను దగా చేయడం కాదా..? ఆయనను ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నడు’ అని మండిపడ్డారు.
‘కొడంగల్-నారాయణపేట్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఈ సర్కారు చేస్తున్న రూ.4,350 కోట్ల ఖర్చుతో పాలమూరు ప్రాజెక్టు కాలువలు అన్నీ పూర్తయితయ్ గదా. లిఫ్టులకంటే ఎక్కువ భూమి సాగు అయితది గదా..? మరె లిఫ్టులు ఎందుకు..? మీ ప్రాధాన్యత ఏంది..? ప్రజలకే రావడమా.. లేదంటే నీకు కమీషన్లు రావడమా..? పాలమూరు బిడ్డను అంటవ్, పాలమూరుకు ద్రోహం చేస్తవ్. ఏండ్లుగా కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు చేసిన ద్రోహలను నువు కొనసాగిస్తున్నవ్’ అని హరీశ్‌రావు ఫైరయ్యారు.