Harish Rao | సిద్దిపేట : తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారు. రేపు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలి. గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరు కలిసి ప్రతి ఇంటికి పోయి ఈ బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలి. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రైతుబంధు ఇప్పుడైతే రూ. 10000 మేము వస్తే రూ. 15000 ఇస్తామన్నారు. పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చిండు మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని రూ. 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు బాకీ పడింది. రైతుబంధు రైతుకి ఇస్తాం. కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా? కరోనా వచ్చినా కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు గాని రైతులకు రైతుబంధు ఆపలేదు. పెద్ద పెద్ద రైతులకు మాత్రమే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నారు అని అన్నీ అబద్దాలే అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు. రాష్ట్రంలో సీలింగ్ ఉంది. 54 ఎకరాల కంటే ఎవరికీ ఎక్కువ భూమి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమందికి తెలంగాణలో భూమి ఉంది అని లెక్క తీస్తే మూడు శాతం మాత్రమే ఉన్నారు. 97 శాతం మంది రైతులు 10 ఎకరాలలోపే ఉన్నారు. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రేవంత్ రెడ్డికి అర్థమైంది అని హరీశ్‌రావు అన్నారు.
200 ఉన్న పెన్షన్‌ని కేసీఆర్ 2000 చేసిండు. పదొంతులు పెన్షన్ పెంచిండు కేసీఆర్. కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఈరోజు వరకు లేదు. అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ గజినీకాంత్ మాటలు.. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి రూ. 44 వేల బాకీ పడిండు. రూ. 44000 ఇచ్చినంకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి. అంతా మోసం. గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి పంచిన్రు. ఒక దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, మరోదిక్కు భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లు పంచిర్రు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు 30 క్యాబినెట్లైనా ఊసే లేదు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరైనా అడుగుతారేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం చూడట్లేదు. రేవంత్ రెడ్డిని ఎవడు నమ్మిటట్టు లేడని రాహుల్ గాంధీ వచ్చి మాటిచ్చాడు. 4,000 పెన్షన్ ఇప్పిచ్చే గ్యారెంటీ నాది అన్నాడు రాహుల్ గాంధీ.
వందరోజుల్లో హామీలు అమలు చేస్తామన్నావు ఏమైంది. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసాం. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద రూ. 2,500 ఇస్తామన్నారు. మాట్లాడితే మహిళలను కోటీశ్వరులని చేస్తామంటారు. ఎవరైనా అయ్యారా? ఈ బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం. ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుంది అని హరీశ్‌రావు తెలిపారు.
యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరుకో మద్యం దుకాణం పెడతాడట. బ్రూవర్లు పెడతాడట. బెల్ట్ షాపులు పెడతారట. మొత్తానికి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటున్నడు రేవంత్ రెడ్డి. తులం బంగారం ఏమైంది రేవంత్ రెడ్డి? కనీసం కల్యాణ లక్ష్మి చెక్కుల పైసలు ఇస్తలేవు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు ఒక విద్యార్థి కైనా ఇచ్చారా. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావ్ కనీసం 5000 ఉద్యోగాలను ఇచ్చేవా రేవంత్ రెడ్డి. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్ ఇస్తే కాగితాలు పంచి నీ ఖాతాలో వేసుకున్నావు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో చెప్పిండు. నిజమే అని నిరుద్యోగ యువతీ యువకులు నమ్మారు. రాహుల్ గాంధీ మోసం చేశారు. ప్రియాంక గాంధీ హుస్నాబాద్‌లో నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు ఇచ్చారా. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ కేలండర్ అయింది. 2,00,000 ఉద్యోగాలు భర్తీ లేకుండా పోయినాయి అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడిందో స్పష్టంగా ఈ బాకీ కార్డ్ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలి. మార్పు మార్పు అన్నాడు ఏమైనా మార్పు వచ్చిందా. కేసీఆర్ చీరలు ఇచ్చారు నేను పట్టుచీరలు ఇస్తా అన్నాడు. పట్టుచీర లేదు ఉన్న చీర కూడా లేదు. మార్పు కాదు ఇది ఏమార్పు. నమ్మించి ఏమార్చి గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. కేసీఆర్ కిట్టు బంద్ అయింది. న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ అయింది. 9 ఏళ్లలో రూ. 20వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు చెల్లించాడు కేసీఆర్. విద్యార్థులను నిర్లక్ష్యం చేసి ఒక రూపాయి ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు లేని పరిస్థితి వచ్చింది. చదువు చెప్పే సార్లకు జీతాలు లేవు. సగం కాలేజీలు మూతపడే విద్యా దానం చేసిండు రేవంత్ రెడ్డి. రెండేళ్లలో ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోవడంతో దావఖానాలో సేవలు బంద్ అయినాయి. కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయలేక పోతున్నాడు రేవంత్ రెడ్డి. పండుగ పూట కనీసం కరెంటు బుగ్గలు పెట్టలేని ప్రభుత్వం ఈ చేతకాని ప్రభుత్వం. గ్యారంటీలకు టాటా చెప్పిండు లంక బిందెలకు వేట పట్టిండు రేవంత్ రెడ్డి. కంచ గచ్చిబౌలిలో, బంజారాహిల్స్‌లో, జూబ్లీహిల్స్‌లో భూముల అమ్ముతా అని బయలుదేరిండు. కేసీఆర్ ఉండంగా ఎట్లుండే తెలంగాణ, రేవంత్ రెడ్డి పాలనలో ఎట్లయింది తెలంగాణ అని ప్రజలకు వివరించాలి. సన్నవడ్లకు రూ. 1300 కోట్ల బోనస్ బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి తమిళనాడులో అక్కడి గవర్నమెంట్ పొద్దున్న టిఫిన్ పెడుతుంది అని పొగిడిండు. కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అధికారంలోకి వచ్చినంక బంధు పెట్టిండు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కడుపునిండా టిఫిన్ పెట్టిండు కేసీఆర్. నువ్వొచ్చి బంద్ చేసినవ్. గ్రీన్ ఛానల్ పెట్టి హాస్టళ్లకి నిధులు విడుదల చేస్తానన్నావు కనీసం తిండి పెట్టే పరిస్థితి లేదు. గుంత పడితే ఫోన్ చేయండి అని ఆర్అండ్ బి మంత్రి కోమటిరెడ్డి అంటారు. కోమటిరెడ్డి నరకమంటే బాగా నరుకుతాడు కానీ గుంతపడని రోడ్డు ఎక్కడైనా ఉన్నదా.. ఫ్యూచర్ సిటీ అని లేని సిటీకి ఆరు లైన్ల రోడ్ వేస్తాడట. ఉన్న రోడ్లను మాత్రం పట్టించుకోరంట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్సంటేజ్ కు భయపడి కాంట్రాక్టర్లు టెండర్లు వేయని పరిస్థితి. పైసలు లేవు అంటాడు. మల్లన్న సాగర్ నుండి మూసిల నీళ్లు పోస్తా అని 7000 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించాడు. ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, బీహార్ ఎన్నికలకు పంపడానికి పైసలు ఉన్నాయి గాని.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు. గోదారి నీళ్లు కాళేశ్వరం ద్వారా కాలువల్లో పారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రజలను ఇంత దగా చేస్తుందని, ఇంత మోసం చేస్తుందని ప్రజలకు వివరించాలి అని హరీశ్‌రావు చెప్పారు.