Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. పీసీ ఘోష్ కమిషన్‌ను కలిసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఏపీలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి పుట్టక ముందు ముత్తాత పుట్టక ముందు ఉన్న ఆయకట్టును కూడా కాంగ్రెస్‌లో కలుపుకున్నడు. 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా కాంగ్రెస్ చేసిందా..? నిజాంలు కట్టిన ప్రాజెక్టులు కూడా అందులో కలుపుకున్నడు. ఎన్నో ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా 1956 ముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్నయి. 16 లక్షల ఎకరాలకు ఏపీ ఏర్పాటుకు ముందే నీటి పారుదల సౌకర్యం ఉంది. ఇది కూడా కలుపుకొని 54 లక్షల ఎకరాలకు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు.
1956లో రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు, ఆనాటి వంద రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి నేడు 104 రూపాయలకు సమాధానం. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసాం. మొత్తం 48లక్షల ఎకరాలకు సాధించినం. ప్రజల్ని తప్పుదోవ పట్టించే అతి తెలివి ఉపయోగించి, పదేండ్లు కాంగ్రెస్ పాలించింది, ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త, స్థీరీకరణ కలిపి ఆరు లక్షల ఎకరాలు మాత్రమే. మేము ఇచ్చింది 48 లక్షలు, పదేండ్ల కాంగ్రెస్ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలు మాత్రమే అని హరీశ్‌రావు తెలిపారు.