Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ బ్యాచ్. అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగింది. బనకచర్లపైన రేవంత్ రెడ్డి నగ్నంగా దొరికిపోయాడు. రేవంత్ రెడ్డి చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచాడు. బనకచర్ల ప్రాజెక్ట్ ఎజెండాలో ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల అసలు చర్చకు రాలేదని అంటున్నాడు. డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తరువాత జై తెలంగాణ అంటాడేమో అనుకున్నాము. జై కర్ణాటక , జై మహారాష్ట్ర అని ఆ రాష్ట్ర నాయకులు అనడం లేదా. కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జై తెలంగాణ అనలేదా. కేటీఆర్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రపంచం ముందు ఉంచాడు. నీలా కేటీఆర్ బ్యాగ్‌లు మోయలేదు. నీ చుట్టూ ఉన్నవారు బ్యాగ్‌లు మోసేవారు. పరిపాలన అంటే బ్యాగ్‌లు మోసుడు కాదు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్పిటల్లో ఉంటున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. జూబ్లీ హిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్‌లోనే పాలన చేస్తున్నావు. సచివాలయంకు ఎందుకు పోవడం లేదు రేవంత్ రెడ్డి. రోజు ప్రజలను కలుస్తా అని మాట ఇచ్చావు కదా..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్ రెడ్డి బాధ పడుతున్నాడు. మహిళలను కోటీశ్వరలను చేస్తా అని మోసం చేశావు. ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఒకరోజు ముందు ఆంధ్ర ప్రదేశ్‌కు షాక్ అని లీక్ ఇచ్చావు. మధ్యాహ్నం కల్లా బనకచర్ల ప్రాజెక్ట్ ఎజెండాలో ఉంటే పోయేది లేదు అని అన్నావు. రాత్రి కల్లా పరుగు పరుగున ఢిల్లీకి పోయావు. కేటీఆర్ సవాల్ విసిరితే చర్చకు రాని వ్యక్తివి.
పైగా కేటీఆర్ పైన పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఈ రాష్ట్రంలో అర్థరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికే ఉన్నది. తాత్కాలిక నీటి ఒప్పందంలో భాగంగా కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ సెక్షన్ 3 సాధించాడు. నీటి ఒప్పందాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు, ఇంటి దొంగ రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి. కేసీఆర్‌కు ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు. నా ఎత్తు గురించి మాట్లాడిన నా అంత ఎత్తు అయితే రేవంత్ రెడ్డికి రాదు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే అసెంబ్లీ పెట్టాలి. అసెంబ్లీలో మా మైక్ కట్ చెయ్యకుండా నిజాయితీగా అన్ని అంశాలపైన చర్చకు బీఆర్ఎస్ రెడీగా ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.