Harish Rao | హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందేంటి ఈరోజు చేస్తున్నది ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు అని ఆయన చెప్పారు.
సకాలంలో రైతులకు ఎరువులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టడమే కాక వారిని పోలీసులతో కొట్టించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈరోజు రైతులు రోడ్డుపైకి వచ్చి రాత్రి పగలు లైన్లో వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చింది. దీనికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పవలసింది పోయి రైతులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎరువుల కోసం రైతులు ఇంకా ఎన్ని అవస్థలు పడాలి? ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి..? ముఖ్యమంత్రి స్వయంగా హోం మంత్రిగా ఉంటూ పోలీసులతో రైతులపై లాఠీచార్జ్ చేయించడం అమానుషం. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.