Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వెనుకబడిన రాష్ర్టాలకు చేయూత అందిస్తూనే, మెరుగ్గా ఉన్న రాష్ర్టాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా కేంద్రం ప్రభుత్వంపైనే ఉన్నదని, ఆ సమతుల్యత పాటించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్‌పై శనివారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీశ్‌రావు మాట్లాడారు. దేశంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయరంగానికి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదని, పైగా సబ్సిడీలు తగ్గించారని విమర్శించారు.
రాష్ర్టానికి నిధులు రాబట్టడంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని మరి కేంద్రం నిధులు ఏమాయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షంగా వెళ్లి ప్రధానిని కలువడానికి తాము రెడీగా ఉన్నామని చెప్పా రు. సొంత ఆదాయ సమీకరణలో 88 శాతం తో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు.ఆదాయం బాగుందని రాష్ర్టానికి నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు వాడుకోవడంలో విఫలమైందని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణకు రాలేదని చెప్పారు.
ఆ రాష్ర్టాలకే అధిక నిధులు
దేశాన్ని పాలించేవారు ఉత్తరాది రాష్ర్టాల వారు కావడంతోనే దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష కొనసాగుతున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. యూపీ, బీహార్లలో ఎంపీ స్థానాలు ఎక్కువ ఉండటంతో ఆ రాష్ర్టాలకు అధికంగా నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ రాష్ర్టాల నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం సైతం తక్కువే అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు సైతం కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో గిరిజన యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. దక్షిణాది రాష్ర్టాలు ఏకమై నిధుల కేటాయింపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఎన్డీయేలో కీలకంగా ఉన్న టీడీపీ పాలిత ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సుమారు రూ.6 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. బీహార్‌కు సైతం వరాల జల్లు కురిపించారని అయినా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రశ్నించకపోవడం ఏంటని మండిపడ్డారు.
వ్యవసాయ రంగానికి పెద్దగా పెంచలేదు
దేశంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయరంగానికి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదని, కేటాయింపులు పెద్ద గా పెంచలేదని విమర్శించారు. పైగా ఎరువుల సబ్సిడీని తగ్గించారని మండిపడ్డారు. ‘ఏటా ఆహార సబ్సిడీని కేంద్రం తగ్గిస్తున్నది. ఏటా సాగుభూమి పెరుగుతుంది. సబ్సిడీ ఎరువుల వాడకం పెరుగుతుంది. అలాంటప్పుడు ఎరువుల సబ్సిడీ పెంచాలా? తగ్గించాలా?’ అని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులను కార్పొరేట్లకు మాఫీ చేసింది. కానీ, రైతులకు రుణమాఫీ చేయడానికి ఎప్పుడూ వ్యతిరేకమే’ అని విమర్శించారు.
రూపాయి విలువ ఎందుకు పడిపోయింది
ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నట్టు కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి చెప్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే మన రూపాయి విలువ పెరిగాలి కదా? గత 12 సంవత్సరాల్లో జారుడుబండ మీద జారిపోయినట్టుగా రూపాయి విలువ జారిపోతా ఉన్నది. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్‌తో రూపాయి విలువ రూ.66-67 ఉండేది. కానీ ఈ రోజు రూ.80 దాటిపోయింది. దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా బలోపేతమైతే ఎందుకు రూపాయి విలువ పడిపోతుందో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి’ అని నిలదీశారు.
నిరుద్యోగం ఎందుకు పెరిగింది
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ప్రోత్సహిస్తున్నట్టు నిర్మలాసీతారామన్ చెప్తున్నారని, కానీ అది కూడా అ వాస్తమేనని హరీశ్ విమర్శించారు. ‘ఉపాధి అవకాశాలు భారీ పరిశ్రమల కంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోనే ఎకువ ఉంటుం ది. పన్నెండేండ్లుగా బీజేపీ ఆ పనిచేసి ఉంటే దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? వీధి వ్యాపారులను ఉద్ధరిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నరు. కానీ, వారికి కేవలం అప్పు మాత్ర మే ఇస్తున్నారు. రుణంలో 50 శాతం సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదు’ అని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలు విఫలం
తెలంగాణకు నిధులు రాబట్టడంలో రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని హరీశ్‌రావు వి మర్శించారు. ‘బీహార్, రాజస్థాన్, యూపీ వంటి ఉత్తరాది రాష్ర్టాలకే అధిక నిధులు కేటాయిస్తున్నారు. వెనుకబడిన రాష్ర్టాలకు చేయూత అందిస్తూనే, మెరుగ్గా ఉన్న రా ష్ర్టాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూ డా కేంద్రంపై ఉన్నది. మా పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 16 శాతం పెరిగింది. కాంగ్రెస్ పాలనలో ఏడాదిలోనే ఆదాయం మైనస్‌లోకి ఎందుకు వెళ్లింది? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాత్మక ఆలోచన చేయా లి. రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై ఆల్ పార్టీ మీటింగ్‌కు ఆహ్వానించాలి. అందరం మోదీని కలుద్దామంటే బీఆర్ఎస్ నాయకులం వస్తాం. ఈ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా కలిసి రావాలి.