Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రూపాయి అప్పుచేసి, వెయ్యి రూపాయల ఆస్తిని సృష్టించామని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘గుమ్మినిండా వడ్లుండాలె, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల. ఇదేం థింకింగ్’ అని ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.
ఈ సందర్భంగా జరిగిన లఘుచర్చలో మాట్లాడిన హరీశ్‌రావు.. ప్రభుత్వ ప్రయత్నాన్ని తప్పుబట్టారు. ఇది శ్వేతపత్రమా? హామీలు, గ్యారెంటీల ఎగవేత ప్రయత్నమా? అని నిలదీశారు. ఇది గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నమని, కొన్ని విషయాలను విస్మరించి పూర్తిగా తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నారని ఆరోపించారు.
శ్వేతపత్రంలోని కర్ణాటక రాష్ట్ర వివరాలు, కాగ్ రిపోర్ట్, బడ్జెట్ నివేదికలనే పరిశీలిస్తే అనేక తప్పలున్నాయని ఆధారాలతో సహా బయటపెట్టారు. కర్ణాటక బడ్జెట్ అంచనాలు రూ.2,31,142 కోట్లుంటే, కాగ్ నివేదికలో రూ.2,31,642 కోట్లుగా ఉన్నదని, ఖర్చుల వివరాలను పరిశీలిస్తే కాగ్ నివేదికలో రూ.2,54,525 కోట్లకు, రూ.2,61,932 కోట్లుగా సుమారు రూ.7 వేల కోట్లు అధికంగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు సౌలభ్యంగా ఉండేలా శ్వేతపత్రం రెడీ చేయించినట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. గత పదేండ్లలో తెలంగాణ చాలా రంగాల్లో ప్రగతి సాధించిందని, అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నామని తెలిపారు. కానీ వాటిని ఈ రిపోర్టులో చూపించలేదని విమర్శించారు. శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం – తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్టు గంపగుత్త లెక తీశారని హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లెకలు శుద్ధతప్పని కొట్టిపారేశారు. కావాలంటే దీనిపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
తమకున్న సమాచారం ప్రకారం తెలంగాణ అధికారులపై నమ్మకం లేక, రిటైర్డ్ అధికారి, సస్పెండైన ఏపీ అధికారులతో శ్వేతపత్రాన్ని సిద్ధం చేయించారని, సీఎం పాత గురుశిష్యులతో వండివార్చారని ఆరోపించారు. ఆ వివరాలు, వాస్తవాలను అవసరమైనప్పుడు బయట పెడతానని వెల్లడించారు. రాష్ట్ర కీర్తిని మసకబారేలా ప్రచారం చేయొద్దని, కీర్తినిపెంచే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.
మూలధన వ్యయంతో సంపద సృష్టి
అప్పు తెచ్చిన ప్రతిపైసాను భవిష్యత్తు తరాల కోసం ఖర్చు చేశామని హరీశ్‌రావు తెలిపారు. మూలధన వ్యయంతో సంపదను సృష్టించామని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాడు పరిస్థితి ఎట్లుండె. ఒక విధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని, కరెంట్ సకగ లేని రాష్ట్రాన్ని, తాగు నీళ్లు సకగ లేని రాష్ట్రాన్ని, సరారు తుమ్మలు మొలిచిన చెరువులు, తెగిన కట్టలు, శిథిలమైన తూములు అలుగులు, ప్రాజెక్టులు లేక సాగు నీరు లేక, బోర్లు బావులే దిక్కయిన రాష్ట్రాన్ని, భూగర్భ జలాలు అడుగంటి 600 ఫీట్లు బోర్లు వేసినా చుక నీళ్లు పడని రాష్ట్రాన్ని, ఉపాధి లేక జనం వలసబాట పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే, ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలె? ప్రజల మీద ఎంత మమకారం ఉండాలె? ఎంత తపన పడాలె? ఎంత తపస్సు చెయ్యాలె? ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే తప్పవుతుందా? తెచ్చిన పైసలతో ఏం చేసినం? సాగునీటి ప్రాజెక్టులు కట్టినం.
పడావుపడ్డ బీడు భూముల్లోకి నదీజలాలను మలిపినం. నీరు పల్లమెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తుకు ఎత్తిపోసినం. అంతేకాదు.. విధ్వంసమైపోయిన చెరువులను పునరుద్ధరించినం. ఆ చెరువులను, ప్రాజెక్టులతో అనుసంధానం చేసినం. నీటి నిల్వ సామర్థ్యం పెంచినం. భూగర్భ జల మట్టం పెంచినం.
భూమికి బరువయ్యేంత పంటపండేలా చేసినం. రైతుల గుండెల్లో భరోసా నింపినం. తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ల దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినం. నడింట్ల నల్లాలు పెట్టి, శుద్ధిచేసిన నదీజలాలను తాగునీరుగా అందించినం. తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తిని పెంచినం. పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసినం. నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినం. అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసినం. క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చేసినం.
రహదారులు, బ్రిడ్జీలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినం. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినం’ అని వివరించారు. 2004-14 వరకు పదేండ్లలో తెలంగాణ ప్రాంతం కోసం కేవలం రూ.54,052 కోట్లు మూలధన వ్యయం చేస్తే, 2014-23 వరకు బీఆర్ఎస్ పాలనలో రూ.3,36,916 కోట్లు మూలధన వ్యయం చేశామని తెలిపారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీఆర్ఎస్ సుమారు 6 రెట్లు ఎక్కువ మూలధన వ్యయాన్ని ఖర్చు చేసిందని వెల్లడించారు.
అప్పుల కట్టడిలో ఆదర్శంగా ఉన్నాం
ఆర్బీఐ నివేదికల ప్రకారం అప్పులు తకువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని హరీశ్‌రావు గుర్తుచేశారు. దేశంలో 22 రాష్ట్రాల అప్పులు మనకంటే కంటే ఎకువ ఉన్నాయని, మన రాష్ట్రం 23వ స్థానంలో ఉన్నదని చెప్పారు. పంజాబ్ 48.7 శాతం, రాజస్థాన్ 40.6 శాతం, కేరళ 38.9 శాతం, ఉత్తరప్రదేశ్ 36.4 శాతం, తమిళనాడు 31.5 శాతం, మధ్యప్రదేశ్ 29.8 శాతం, ఛత్తీస్‌గఢ్ 28.6 శాతం రుణాలు తీసుకున్నాయని, తెలంగాణ తీసుకున్న రుణం 28.2 శాతం మాత్రమేనని వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వం అప్పుల పరిమాణాన్ని పెద్దగా చూపేందుకు, తద్వారా బీఆర్ఎస్పై బురద జల్లేందుకు మరో కుట్రపూరిత వైఖరి అనుసరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలించిన రాజస్థాన్‌లో 2022-23 రూ.5,37,013 కోట్ల అప్పు, కర్ణాటకలో రూ.5,35,157 కోట్లు ఉన్నాయని, ఆ వివరాలను మాత్రం వెల్లడించలేదని ప్రశ్నించారు.
కార్పొరేషన్ల రుణాలు.. ప్రభుత్వ అప్పులెలా అయితయ్?
కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగా చిత్రీకరించి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. కార్పొరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని మాత్రమే ఇస్తుందని తెలిపారు. ఉదాహరణకు పౌరసరఫరాల కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులను రాష్ట్ర అప్పులుగా ఈ ప్రభుత్వం చూపించిదని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని చెప్పారు. విద్యుత్తు సంస్థ తీసుకున్న రుణాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల స్థాపన, పంపిణీ వ్యవస్థల బలోపేతం కోసమే ఖర్చు చేసినట్టు తెలిపారు.
విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంస్థ తిరిగి ఆ రుణాలను చెల్లిస్తుందని గుర్తుచేశారు. అదంతా రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఎలా అవుతుందని, ఈ వికృత సూత్రీకరణలు, వక్రీకరణ ఎందుకు? అని నిలదీశారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిననాడు ఖాళీ చిప్ప చేతికిచ్చారని నిందలేయలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలని ప్రయత్నం చేశామని, తపనతో పనిచేసి, పనితనంతో అభివృద్ధి వైపు నడిపించామని, దేశానికి ఆదర్శంగా నిలిపామని చెప్పారు. దేశ తలసరి ఆదాయం రూ.1,72,276 కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,122 ఎకువ అని, అంటే సుమారు డబుల్ అయ్యిందని పేర్కొన్నారు.
దివాలా అంటూ దిక్కుమాలిన ప్రచారం మానుకోండి
‘కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే మారెట్లో తెలంగాణ విశ్వసనీయత దెబ్బతింటుంది. పెట్టుబడులు రాకుండా పోతాయి. రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం కింద ఇచ్చే 3 శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి. బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. దివాలా.. దివాలా.. అని ప్రభుత్వమే దికుమాలిన ప్రచారం చేస్తే, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతయా? దివాలా తీసిన రాష్ట్రం నీళ్లివ్వగలుగుతదా? కరెంట్ ఇవ్వగలుగుతదా? అన్న అపోహలు, అనుమానాలు తలెత్తుతాయి. పర్యవసానంగా పెట్టుబడులు ఆగి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి’ అని హరీశ్ హెచ్చరించారు.
ఒక చిన్న వదంతుతో స్టాక్ మారెట్ కుప్పకూలిన సంఘటనలు చూశామని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా వదంతులు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తాము ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, ప్రభుత్వ గ్యారెంటీలను నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ‘అలవిగాని హామీలతో ప్రజలకు పంచరంగుల కలలు చూపించి అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు మీరు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు చేయాలి. మ్యానిఫెస్టోలో చెప్పిన ఇతర హామీలు అమలు చేయాలి. దానికి బదులుగా ఈ శ్వేతపత్రాల తతంగం ద్వారా ప్రజల దృష్టిని మరల్చలేరు. మీరు చెప్పినట్టు 90 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు షరతులు లేకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వండి. సబ్సిడీతో రూ.500కే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. అంతేకానీ, ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి.
దేశానికే దిక్సూచి అయిన తెలంగాణను దివాలా తీసిందని ముద్ర వేయకండి. సంపద ఉన్నది. సమృద్ధి ఉన్నది. వృద్ధిరేటును పెంచండి. మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను కట్టడి చేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. అంతేగానీ అవాకులు, చెవాకులతో రాష్ట్ర భవిష్యత్తును అఘాతం చేయకండి. రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఉన్న కన్సర్న్తో, ఆవేదనతో, ఆర్తితో విజ్ఞప్తి చేస్తున్నా. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అప్పీల్ టు గవర్నమెంట్. జై తెలంగాణ’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రగతిభవన్‌లో 150 గదులున్నాయా ?
ప్రాజెక్టులు కట్టినా, ప్రగతిభవన్ కట్టినా ప్రజల కోసమేనని హరీశ్ తెలిపారు. ప్రాజెక్టుల మీద, ప్రగతిభవన్ మీద దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రగతిభవన్‌లో 150 గదులున్నాయా? బుల్లెట్‌ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయా? 250 సీట్లున్న సినిమా థియేటర్ ఉన్నదా? అనేదానిపై ఇప్పుడు అదే ప్రగతిభవన్‌లో ఉంటున్న భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పదేండ్లు సీఎంగా ఉన్నా, కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకుని తిరిగి ఆ ఇంటికే వెళ్లి ఉంటున్నారని గుర్తుచేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు మిగిలిన నేతలు ప్రస్తుతం కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలోనూ ఇదే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనే అవినీతి ప్రచారం చేశారని వెల్లడించారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు.
కరోనా కాలాన్ని వైఫల్యంగా చూపుతున్నారు
రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్బీఐ వద్ద 303 రోజులకు సరిపడా నిల్వలు ఉంటే, ఆ తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోయిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన లెక్కలను హరీశ్‌రావు తప్పుపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి కరోనా రెండేళ్ల కాలంలోని లెక్కలను చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2016-17లో 304 రోజులు, 2017-18లో 245 రోజులు, 2018-19లో 252 రోజులు మిగులు రోజులుగా ఉన్న విషయాన్ని సీఎం దాచిపెడుతున్నారని ఆరోపించారు. అటు.. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, హక్కులపై కేంద్రంపై పోరాడేందుకు ప్రభుత్వానికి బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ర్టానికి రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకునేందుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.
సంపద, వసతులు ఉంటేనే కంపెనీలొస్తయ్
ఒక పరిశ్రమ, కంపెనీ రావాలంటే అక్కడి సంపద, వసతులు ప్రధానంగా చూస్తారని హరీశ్‌రావు తెలిపారు. తద్వారా అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్తు, సమృద్ధిగా నీళ్లు, రాజకీయ సుస్థిరత, మెరుగైన శాంతిభద్రతలు ఉండటం వల్లే ఆపిల్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఫాక్స్‌కాన్ వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వాణిజ్య కార్యకలాపాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రం అప్పుల కుప్పయితే అంతర్జాతీయ సంస్థలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు చదువుకున్న సుమతి శతకం పద్యాన్ని గుర్తు చేశారు. ‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్.. దెప్పలుగ చెరువునిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి’ అని అన్నారు.
సగం మందికి రాష్ట్రమే సొంతంగా రేషన్
రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు కేంద్రం 5 కిలోలు ఇస్తుంటే గత ప్రభుత్వం ఒక కిలో మాత్రమే దానికి కలిపి పంపిణీ చేసిందంటూ పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మొత్తం 90 లక్షల కార్డులుండగా, 54 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంటే, మిగిలిన 36 లక్షల కార్డుదారులకు గత రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిందని వివరించారు. దీనితో పాటు కేంద్రం ఇచ్చిన కార్డులకు కూడా అదనంగా ఒక కిలో చొప్పున పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
కరోనా సమయంలో రెండేండ్ల పాటు ఉచితంగా ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇక రూ.90 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ద్వారా అదనపు ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపల్ని కూడా హరీశ్ ఖండించారు. గతంలో కల్వకుర్తి ప్రాజెక్టును 75 శాతం కాంగ్రెస్ పూర్తి చేస్తే, మిగిలిన మొత్తాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పటికే పంపుల ఏర్పాటు పూర్తయిందని, మిగిలిన పనిని పూర్తి చేస్తే మీరు కూడా నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు.
పైసల కోసం మోటర్లకు మీటర్లు పెట్టకండి
బోర్లకాడ, బాయిలకాడ మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అదనంగా 0.5 శాతం రుణాలు ఇస్తామని కేంద్రం చెప్పిందని, కానీ దానికి తాము అంగీకరించలేదని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు. ఒకవేళ తాము నిబంధనకు అంగీకరించి ఉంటే ఇప్పుడు రూ.35 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి అదనంగా వచ్చేవని, తాము ఎడాపెడా అప్పులు చేసేవాళ్లమే అయితే, ఆ రూ.35 వేల కోట్లు ఎందుకు వదులుకుంటామని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ ఆ నిబంధనను ఒప్పుకొని నిధులు తెచ్చుకున్నాయని, కానీ.. కేసీఆర్ మాత్రం కంఠంలో ప్రాణముండగా ఒప్పుకోబోమని తెగేసి చెప్పారని తేల్చి చెప్పారు. చివరికి కర్ణాటక కూడా బాయిలకాడ మీటర్లు పెట్టేందుకు ఒప్పుకొని నిధులు సమకూర్చుకుంటున్నదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఇదేనని అన్నారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల మాదిరి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకొని 70 లక్షల రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
7 లక్షల కోట్ల అప్పు అవాస్తవం
గత ప్రభుత్వంలో రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నదనేది అవాస్తమని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక తప్పుడు లెక్కలు చెప్పి, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పును రూ.7 లక్షల కోట్లుగా చూపారని మండిపడ్డారు. దేశంలో 22 రాష్ర్టాలు అప్పుల్లో తెలంగాణ కంటే ముందున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన ఆస్తుల గురించి ఈ ప్రభుత్వం వెల్లడంచలేదని, సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ ఎంతో ముందున్నదని వెల్లడించారు.
‘47 లక్షల మంది వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ.2 వేల ఆసరా పింఛన్ ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లు రైతుబంధు అందించాం. 13 లక్షల 50 వేల మంది పేదింటి ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మి ఇచ్చాం. రాష్ట్రంలో దవాఖానలు బాగు చేసుకున్నాం. రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చాం. సగంలో వదిలిపెట్టిన మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, దేవాదుల, నెట్టెంపాడు కల్వకుర్తి, తుమ్మిళ్ల వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాం’ అని వివరించారు.