Harish Rao | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ అపాయింటెడ్ డే ఎప్పుడు ప్రకటిస్తారు? ఆ ప్రక్రియ ఎందుకు జాప్యమవుతున్నది? ఎప్పటిలోగా అమలుచేస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ, సిబ్బంది సంక్షేమంపై ఇచ్చిన హామీలను సభలో చదివి వినిపించారు. పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తామని, అధునాతన సౌకర్యాలతో కొత్త సర్వీస్‌లను ప్రారంభిస్తామని, ఆర్టీసీని యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కచ్చితంగా ఓ తేదీని సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
5 నెలలైనా డమ్మీ చెక్కు నెక్లెస్‌రోడ్ దాటలే!
ఆర్టీసీలో చనిపోయిన కార్మికుల కుటుంబీకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారుణ్య నియామకం కింద వెంటనే పర్మినెంట్ ఉద్యోగం కల్పించేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కన్సాలిడేటెడ్ పే రూ.15 వేలకు మూడేండ్లు ఉద్యోగం చేయించుకొని ఆ తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్తున్నదని, ఇది చనిపోయిన కార్మికులకు అన్యాయం చేయడమేనని హరీశ్‌రావు మండిపడ్డారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రస్తుత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిందని, ఆ సందర్భంగా ఒక రూ.300 కోట్ల డమ్మీ చెకును చూపిస్తూ ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ బకాయిలను విడుదల చేస్తున్నానని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ ఫొటోలు దిగారని, దాదాపు ఐదు నెలలు దాటుతున్నా ఆ చెకు నెక్లెస్ రోడ్ దాటి బస్సు భవన్‌కు చేరలేదని ఎద్దేవా చేశారు. గతంలో తమ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్, ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, బడ్జెట్లో వేల కోట్లు పెట్టి ఆర్టీసీని కాపాడామని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం..
మహాలక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. మహాలక్ష్మి పథకం తర్వాత పనిభారం పెరిగిందని, సరిపడా సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఉన్న కార్మికులే 16 గంటలు, 18 గంటలు పనిచేయాల్సిన వస్తున్నదని, ఫలితంగా పని ఒత్తిడికిలోనై వందల మంది చనిపోతున్న మాట వాస్తవమా కాదా ? అని నిలదీశారు. పనిభారానికి తగిన విధంగా కండక్టర్లు, డ్రైవర్లను ఎప్పటిలోగా నియమిస్తారని ప్రశ్నించారు.
సమాధానం చెప్పకుండా పొన్నం ఎదురుదాడి
మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలకు దిగారు. ఆర్టీసీని బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఆదరాబాదరగా విలీన ప్రక్రియ చేపట్టిందని, ప్రస్తుతం ఆ అంశం తమ పరిశీలనలో ఉన్నదని, ఎలాంటి జాప్యం జరగడం లేదని బదులిచ్చారు. పదేండ్లలో ఒక బస్సు కూడా కొనలేదని, తాము అధికారంలోకి రాగానే కొత్త బస్సులు కొన్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.300 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, అందుకు సంబంధించి రూ.2400 కోట్లను ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇస్తున్నామని, ఆర్టీసీ తార్నాక హాస్పిటల్లో అధునాతన వసతులు కల్పిస్తున్నామని, 3035 ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. సిబ్బందికి పనిభారం పెరిగిన మాట వాస్తవమేనని, అయితే 8 గంటల తర్వాత కూడా పనిచేసే వారికి డబుల్ పేమెంట్ చెల్లిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలపై స్పందించిన మంత్రి ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ ఊసెత్తకుండానే ముగించారు.