Patnam Narender Reddy | హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా నమోదు చేయించిన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై జరిగిన దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, రాజకీయ ప్రేరేపితంతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. కొడంగల్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తనకు విధించిన రిమాండ్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు. తుది ఉత్తర్వులు జారీ చేసేలోగా రిమాండ్ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు నరేందర్‌రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, వికారాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లను ప్రతివాదులుగా పేరొన్నారు.
బొమ్రాస్పేట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కింది కోర్టు యాంత్రికంగా ఆమోదించి రిమాండ్ ఉత్తర్వులు జారీచేసిందని నరేందర్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 2న లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి వికారాబాద్సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు సంబంధించిన భూసేకరణ కోసం పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నదని, ప్రభుత్వ అధికారులపై భూ బాధితులు దాడి చేస్తే దానికి తనను బాధ్యుడ్ని చేయడం అన్యాయమని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వాళ్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను అన్యాయంగా నిందితుడ్ని చేశారని తెలిపారు.
తనను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. తనను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కింది కోర్టు ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయలేదని తెలిపారు. రిమాండ్ డైరీలో పేరొన్న విధంగా పిటిషనర్ అరెస్టును సమర్థించే కారణాలను తనకు గానీ తన భార్యకు గానీ తెలియజేయలేదని తప్పుపట్టారు. ప్రబీర్ పురాయస్థ వర్సెస్ దిల్లీ రాష్ట్రం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను అమలు చేయడంలో మేజిస్ట్రేట్ విఫలమయ్యారని పేర్కొన్నారు.
పోలీసులు ఏకపక్షంగా, దుర్మార్గంగా, రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారనే వాస్తవాన్ని మేజిస్ట్రేట్ విస్మరించారని తెలిపారు. రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం అరెస్టుకు కారణాల గురించి తెలుసుకునే హకు తనకు ఉన్నదని, ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ విస్మరించారని అన్నారు. ఏదైనా ప్రాథమిక హకు ఉల్లంఘన జరిగి అరెస్టు జరిగితే ఆ ప్రక్రియను ఆర్టికల్ 22 అడ్డుకుంటుందని గుర్తుచేశారు. తనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించే ముందు.. సుప్రీంకోర్టు డీకే బసుపశ్చిమ బెంగాల్ మధ్య జరిగిన కేసులోని మార్గదర్శకాలను అమలు చేయడంలో మేజిస్ట్రేట్ విఫలం అయ్యారని తెలిపారు.
రిమాండ్ డైరీలో పేరొన్న ఆరోపణలు సెక్షన్ 109 ప్రకారం చెల్లవన్నారు. అధికారులు పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా ప్రజలు రాళ్లు రువ్వేందుకు తాను ప్రోత్సహించాననే అభియోగాలకు అర్థం లేదని తెలిపారు. ప్రజలు ఎవరూ కావాలని అధికారులపై దాడి చేయరని అన్నారు. ప్రభుత్వ అధికారులకు, దాడికి పాల్పడిన వ్యక్తులకు మధ్య ఎలాంటి శతృత్వం ఉండదనే వాస్తవ విషయాన్ని గుర్తెరగాలని కోరారు. రిమాండ్ కేసు డైరీలో పేరొన్న ఆరోపణలు బీఎన్ఎస్ 109 సెక్షన్ ప్రకారం శిక్షార్హమైన నేరాన్ని మోపేందుకు ఆధారాలు ఏమీ చూపలేదని తెలిపారు.ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొడంగల్ కోర్టు జారీచేసిన రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. తుది ఉత్తర్వులు జారీచేసే వరకు రిమాండ్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.