Chirumarthi Lingaiah | నల్లగొండ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగునీటి ఇబ్బందులు, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు. సాగు నీరు అందక పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోయి రైతన్న తల్లడిల్లుతుంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని ధ్వజమెత్తారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీళ్లు లేక, కరెంటు లేక రైతుల పొలాలు ఎండుతున్నాయి. పశువులకు మేతగా మారుతున్నాయి, రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంట పొలాలను రైతులు కాపాడు కోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పాడి పంటలతో సంతోషంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ పంటలను తామే,కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు.
స్పష్టమైన కారణం లేకుండా జగదీశ్ రెడ్డిపై వేటు హేయమైన చర్య అని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి గొంతు నొక్కి ఏదో సాధిస్తామంటే అది సర్కార్ పిచ్చి ఆలోచన మాత్రమే. తెలంగాణ సమాజం అంతా చూస్తోంది… ప్రజాక్షేత్రంలో ప్రతిదానికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్పిందే. రేవంత్ రెడ్డి మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాను దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మైక్‌ల ముందు మాటలు మాట్లాడనంత ఈజీ కాదు పరిపాలన చేయడం. తెలంగాణ కోసం మరణానికి సిద్ధపడిన కేసీఆర్ చావు కోరుకునే నీచ బుద్ది కలిగిన కుసంస్కారి వైన నీ మొహం చూడటానికి కేసీఆర్ అసెంబ్లీ రావాలా..? నీ చేతకాని పరిపాలన,మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ సైనికులుగా మేము సరిపోతాం.. త్వరలోనే ప్రజలు నిన్ను తరిమికొట్టడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.