KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనలోని తప్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్ తమిళనాడులో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల గురించి తెలిపే పుస్తకంతో పాటు 69శాతం రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలను కేసీఆర్‌కు అందజేశారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని శుభప్రద్ పటేల్‌కు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదని, దాని అమలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలను సమాయత్తం చేయాలని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, వారి సంక్షేమం కోసం గత పదేళ్లుగా పార్టీ, ప్రభుత్వం విశేష కృషి చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యమ పంథాను ముందుకు తీసుకెళ్లాలని సూచించడంతో పాటు పార్టీ అండగా ఉంటుందని శుభప్రద్ పటేల్‌కు కేసీఆర్ ధైర్యం చెప్పారు.