కరీంనగర్ : క్యాన్సర్రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) పిలుపునిచ్చారు. కరీంనగర్లోని గౌతమి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ గౌతమి -రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ ఆరంభ్’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ క్యాన్సర్రహిత(Cancer Free) సమాజం కోసం పాటు పడుతున్న గౌతమి ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
పవిత్రమైన వైద్య వృత్తి నిర్వహిస్తూ ప్రజల్లో మార్పు కోసం సామాజిక సేవా చేస్తున్న గౌతమి ఫౌండేషన్ మరెన్నో కార్యక్రమమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రామడుగు మండలం కొక్కెర కుంట గ్రామాన్ని దత్తత తీసుకొని రెండు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం(Organic farming) చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. పురుగుల మందుతో వ్యవసాయం చేయడం వల్ల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు, యువకులు కూడా క్యాన్సర్, గుండె జబ్బుల బారినపడుతున్నారని అన్నారు. ఆహార అలవాట్లను, జీవన శైలిలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కన్నా మల్ల విజయ, డాక్టర్ రామ్ కిరణ్ పొలాస, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తోటరాములు, మీడిదొడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు .