హైదరాబాద్, ఫిబ్రవరి9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముద్దుబిడ్డ, సంస్కరణశీలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావును సొంత పార్టీనే అడుగడుగునా అనేక అవమానాలకు గురిచేసింది. బతికి ఉన్నప్పుడే కాదు మరణానంతరం కూడా ఆ వివక్ష చూపింది. సొంత పార్టీ నేతగా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించలేదన్నది చారిత్రక సత్యం. దేశం అనేక సంక్లిష్ట సమస్యల్లో కూరుకుపోయిన తరుణంలో తన ప్రజ్ఞాపాటవాలతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్ల్లు ముందుకు నడపడమేకాకుండా భారత్‌ను ప్రగతి పథంలో నడింపించిన మహనీయుడు పీవీ. నేడు దేశంలో డబ్బు చలామణి పెరగడానికి, అంతర్జాతీయ కంపెనీలు రావడానికి పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలే మూలస్తంభాలని, స్వయంగా మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతటి మహనీయుడు పీవీని కాంగ్రెస్ మాత్రం ఏనాడూ గౌరవించలేదు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పీవీ పేరెత్తడానికి సైతం సాహసించలేదు. పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణతోపాటు, ఎందరో మేధావులు డిమాండ్ చేసినా నాటి యూపీఏ సర్కారు పట్టించుకోలేదు. పీవీ సేవలను మరుగున పడేసేందుకే అడుగడుగునా యత్నించింది. తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించిన అనంతరమే మళ్లీ కాంగ్రెస్ నేతల్లో కొంత చలనం వచ్చింది. పీవీ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోనే నిర్వహించాలని కుటుంబీకులు పట్టుబట్టారు. కానీ అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అది సాధ్యం కాదని చెప్పి పీవీ పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు పంపించారు. ఢిల్లీలో పీవీ స్మారకం నిర్మించాలన్న డిమాండ్‌ను కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించినా.. పీవీకి ఓ స్మారకం నిర్మించకపోవడం ఆ పార్టీ పెద్దలు తెలంగాణ బిడ్డ పీవీని అవమానించిన తీరుకు నిదర్శనం. పీవీ విషయంలో నాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా తీవ్ర అన్యాయం చేసిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. అనాటి కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్‌లో అత్యంత అవమానకరమైన రీతిలో పీవీ అంత్యక్రియలను నిర్వహించింది.