హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్య చర్యలతో ఒక్కో రంగం కుదేలువుతున్నది. ఫలితంగా తెలంగాణలో ఆర్థిక విపత్తు ముంచుకొస్తున్నది. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రతి ద్రవ్యోల్బణం (డీఫ్లేషన్) జోన్లోకి వెళ్తున్నది. వరుసగా రెండో నెలలో కూడా ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో వరుసగా రెండు నెలలు ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా వరుసగా రెండునెలలు ప్రతి ద్రవ్యోల్బణం నమోదు కాలేదు. ఇది రాష్ట్రంలో కొవిడ్-19 మహమ్మారి కాలంనాటి దారుణ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజాగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో జూలై నెలలో గ్రామీణ ప్రతిద్రవ్యోల్బణం -0.91 శాతం, పట్టణ ప్రతి ద్రవ్యోల్బణం -0.05 శాతం, రాష్ట్ర సగటు ప్రతి ద్రవ్యోల్బణం -0.44 శాతం నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం మాత్రం 1.55 శాతంగా నమోదైంది. గత నెలలో కూడా రాష్ట్రం డీఫ్లేషన్నే నమోదు చేసింది. రాష్ట్రంలో వరుసగా రెండు నెలలు ప్రతి ద్రవ్యోల్బణం నమోదు కావడం ప్రమాదకర సంకేతమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్టు సూచించే ప్రమాదకర సంకేతమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని పట్టించుకోని పక్షంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
ఏ రాష్ర్టానికైనా ప్రతి ద్రవ్యోల్బణం (డీఫ్లేషన్) ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్ వంటిది. అందుకే ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధి కోసం ద్రవ్యోల్బణ రేటు 2-6 శాతం మధ్య ఉండాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, తెలంగాణలో ద్రవ్యోల్బణం సున్నా కంటే తకువకు పడిపోయింది. జూన్‌లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం డీఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ‘డీఫ్లేషన్ కారణంగా ప్రజల్లో కొనుగోలుశక్తి పడిపోయి వ్యాపారాలు దెబ్బతింటాయి. ఉద్యోగాలు ఊడిపోతాయి. రాష్ర్టానికి కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతున్నది’ అని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారు అవగాహన లేమి, అడ్డగోలు చర్యలే కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు రూ.4,000 ఆసరా పెన్షన్, మహాలక్ష్మి కింద మహిళలకు రూ. 2,500, రైతుభరోసా రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు, దళితబంధు కింద రూ.12 లక్షలు.. ఇలాంటి 420 హామీలు ఇంకా అమలు కాలేదు. ఈ హామీలు నెరవేర్చి ఉంటే ప్రజల చేతిలో డబ్బు ఉండి వారిలో కొనుగోలు శక్తి పెరిగేది. మార్కెట్లో నగదు లావాదేవీలు జరిగేవి. వస్తు సామగ్రికి డిమాండ్ పెరిగి ఉండేది. ప్రాజెక్టులపై ప్రభుత్వ మూలధన వ్యయం గణనీయంగా తగ్గింది. ఇది ఆర్థిక వృద్ధిని నిలిపివేసింది.
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాలను కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ లోపాలు దెబ్బతీశాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల లావాదేవీలు పడిపోయాయి. మూసీ, హైడ్రా వంటి ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేశాయి. వేలాది ఉద్యోగ అవకాశాలు హరించుకుపోయాయి. మూలధన వ్యయం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన మూలధన వ్యయాన్ని కూడా కుదించేసింది. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారింది. ప్రభుత్వం మారెట్లోకి ఎకువ డబ్బును పంపిణీ చేయడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఒకప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇప్పుడు తిరోగమనంలోకి వెళ్లడం బాధాకరం. కాంగ్రెస్ పాలనలో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ నాశనమవుతున్నది. హోప్లెస్ గవర్నమెంట్, హోప్లెస్ గవర్నెన్స్’ అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దగ్గర ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకెళ్లిందని, ఇప్పుడు ఆ రంగాలన్నీ కుదేలయ్యాయని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వెంటనే సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి పోకుండా ఉండడానికి తక్షణమే ఆర్థిక సంసరణలు, ఉద్యోగ కల్పన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రం మళ్లీ పురోగతి పథంలో నడవాలంటే, ప్రభుత్వం తన వైఫల్యాలను సరిదిద్దుకోవాలని కేటీఆర్ హితవుపలికారు.
ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు సమయానుకూలంగా పెరుగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే.. వస్తువులు, సేవల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి (డీఫ్లేషన్-ప్రతి ద్రవ్యోల్బణం) వెళితే ప్రజల కొనుగోలుశక్తి క్షీణించిందన్న మాట. డీఫ్లేషన్ అనేది ధరలు తగ్గడం కంటే మించిన సమస్య. ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కుప్పకూలడం, పెట్టుబడులు నిలిచిపోవడం, ప్రజల ఖర్చు సామర్థ్యం తగ్గడం వంటి సంకేతాలను ఇస్తుంది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఉన్నాయి. కూరగాయలు, నూనె, నిత్యావసరాల ధరల్లో మార్పు లేదు. సూల్, కాలేజీ ఫీజులు కూడా ఏమాత్రం తగ్గలేదు. కానీ, రియల్ ఎస్టేట్ మారెట్ కుప్పకూలింది. ఉపాధి అవకాశాలు తగ్గాయి. ప్రజల ఖర్చు సామర్థ్యం క్షీణించింది. వినోదం, టూరిజంపై ఖర్చు తగ్గింది. వ్యాపార పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలాంటి కారణాలతో జూన్, జూలైలలో డీఫ్లేషన్ నమోదైంది. ఇది కేవలం ద్రవ్యోల్బణ నియంత్రణ కాదు.. ఇది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంకేతం. ఇది గణాంకాల్లో కనిపించే నెగెటివ్ నంబర్ల కన్నా చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు నెలలపాటు ప్రతి ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి స్పష్టమైన నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా జూన్, జూలై నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైందని తెలిపారు.
ప్రతి ద్రవ్యోల్బణం సానుకూల సంకేతం కాదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలన్నీ స్తంభించిపోయాయని తెలిపారు. కొత్త ఉద్యోగాల కల్పన లేకపోవడం, ఆర్థిక కార్యకలాపాలు మందగించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆర్థిక నిపుణుల సూచనలను ప్రభుత్వం పట్టించుకోవాలని హితవుపలికారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ముందుముందు ఇంకా కష్టకాలమే. కాంగ్రెస్ పాలన ఎంత తొందరగా పోతే.. అంత తొందరగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగువుతుంది. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్‌రెడ్డి.. పాలన కారణంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. హైడ్రాతో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలుకావడం లేదు. ప్రజల చేతిలో డబ్బు లేక గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చులు తగ్గిపోయాయి. కాళేశ్వరం నీళ్లు రాక పంటలు ఎండిపోయాయి. కేటీఆర్ హయాంలో కొత్త పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయి. నేడు ఆ పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఎదురుతిరుగుతున్నా ప్రభుత్వం నుంచి చలనం లేదు. రేవంత్‌రెడ్డి పాలన మారితే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటది. లేదంటే ఇంకా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది.
-డీ పాపారావు, ఆర్థికరంగ నిపుణుడు.
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎదగడం కాదు.. కుప్పకూలుతున్నది. రెండు నెలల డీఫ్లేషన్ కేవలం గణాంకం కాదు. ఇది పాలన వైఫల్యానికి నిదర్శనం. ప్రభుత్వం వెంటనే ప్రజల చేతికి డబ్బు అందించి, పెద్దఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించకపోతే, ఈ డీఫ్లేషన్ మరింత తీవ్రమై, రాష్ట్రం మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉన్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన రాజకీయ వైరుధ్యాలను పకనపెట్టి, ప్రజల ఆర్థిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. లేకపోతే ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ మరింత లోతుగా కూరుకుపోతుంది.
-హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే