KCR Speech | చండ్రనిప్పులు చెరిగే ఎండాకాలంలో ప్రళయగర్జన చేసిన జగిత్యాల సభ, రెండేండ్ల ముందే రాబోయే ప్రభుత్వమేదో ఖరారు చేసింది. హాజరైన లక్షలాది మంది ప్రజల్లో జోష్, కేసీఆర్ ప్రతి మాటకు వచ్చిన స్పందన, ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాల హోరే దానికి తార్కాణం.
వరంగల్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జగిత్యాల సభ సీనియర్ నేత జీవన్‌రెడ్డి చేరిక కోసం పెట్టినా, అది దానికే పరిమితం కాలేదు. గ్యారెంటీ మోసాల సర్కార్ మీద యుద్ధభేరి మోగించిన రీతిలో బీఆర్ఎస్ సభ సాగింది. అన్నింటినీ మించి మళ్లీ ఉద్యమకాలంనాటి కేసీఆర్‌ను ప్రజలముందుకు తెచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టింది? అనే ప్రశ్న దగ్గరి నుంచి రాష్ట్ర ఆవిర్భావం దాకా తెలంగాణకు జరిగిన అన్యాయాలు, కుట్రలన్నింటినీ ప్రజలకు విడమరిచి చెప్పిన కేసీఆర్.. గత రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతగా ధ్వంసమైందో ప్రజల కండ్లకు కట్టారు. తూటా మందును దట్టించిన తుపాకీలా కేసీఆర్ తన ప్రసంగంతో ప్రళయగర్జన చేసి ఉర్రూతలూగించారు. ప్రసంగం ప్రారంభం నుంచి చివరిదాకా సర్కార్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఎవరి పేరూ తీసుకోకుండానే ప్రభుత్వాన్ని, పాలనను కడిగిపారేయడం విశేషం. ప్రశ్నలు వేసి ప్రజలతోనే వారు ఎదుర్కొంటున్న కడగండ్లను చెప్పించడం కొసమెరుపు.
తెలంగాణ సమాజంలో చోటుచేసుకుంటున్న ఉద్వేగభరిత వాతావరణాన్ని కేసీఆర్ ప్రసంగం కండ్లకు కడుతూనే, ఎక్కడా, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. హుందాగా బాధ్యతగా సాగిన ఆయన ప్రసంగం ద్వారా తెలంగాణలో పదేండ్లు దర్జాగా సాగిన ఒక్కొక్క రంగం ఇవ్వాళ ఎలా నిర్వీర్యమై నీరుగారిపోతున్నదో వివరించారు.
నిరుడు వరంగల్-ఎల్కతుర్తి వేదికగా జరుపుకొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు, జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు తేడా ఒక్కటే.. రజతోత్సవ సభ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపితే, జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ రేపటి రోజు ఎవరిదో స్పష్టం చేసింది. తెలంగాణ సమాజంలో చోటుచేసుకుంటున్న ఉద్వేగభరిత వాతావరణాన్ని కేసీఆర్ ప్రసంగం కండ్లకు కడుతూనే, ఎక్కడా, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. హుందాగా బాధ్యతగా సాగిన ఆయన ప్రసంగం ద్వారా తెలంగాణలో పదేండ్లు దర్జాగా సాగిన ఒక్కొక్క రంగం ఇవ్వాళ ఎలా నిర్వీర్యమై నీరుగారిపోతున్నదో వివరించారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు? అని ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణమే కాదు, జగిత్యాల పట్టణంతోపాటు యావత్‌దేశం టీవీలకు అతుక్కుపోయి ఆసక్తిగా చూసింది. ఐపీఎల్ మ్యాచ్ పక్కకు పోయిందని, కేసీఆర్ ప్రసంగాన్నే ప్రజలు విన్నారని పలు జాతీయ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తేల్చిచెప్పాయి. సభా ప్రాంగణంలో కుర్చీలు దొరకని వారు, ప్రాంగణానికి రాలేనివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ముందు నేలమీద కూర్చొని తరగతి గదిలో పిల్లలు పాఠం విన్నట్టు కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. గ్రామాల్లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకొని కేసీఆర్ ప్రసంగాన్ని విన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అమెరికాలో ఓ వ్యక్తి తన ఫోన్లో కేసీఆర్ ప్రసంగం వింటూ తన పని చేసుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది. మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ సభ అంటే ఒక జాతర, ఒక ఉత్సవం, ఒక జోష్ అనే నానుడిని ఈ సభ మళ్లీ గుర్తు చేసింది.
ఒకేరోజు.. ఒకే ఉమ్మడి జిల్లా.. రెండు బహిరంగ సభలు. వాటి మధ్యదూరం దాదాపు వంద కిలోమీటర్లు. ఒకటి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాదసభ, మరొకటి జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్పల్లిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాపాలన సభ. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఎంతో హుందాతనాన్ని పరిమళింపజేస్తే, కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో జరిగిన సభ ఆక్రోశం, ఉక్రోషంతో బుసలుకొట్టింది. శాపనార్థాలు, శోకనార్థాలకు నెలవైంది. డబ్బాలో రాళ్లేసి ఊపితే ఏర్పడే శబ్దకాలుష్యాన్ని కాటారం సభ వెదజల్లితే.. దుర్మార్గపాలన మీద ప్రజాయుద్ధానికి సమర సందేశమిచ్చిన రీతిలో జగిత్యాల సభ జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ రెండు బహిరంగసభలను పోలుస్తూ రాష్ట్రంలో అన్నివర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది.

Cbn Vs Revanth
సీఎం రేవంత్‌రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పతాకస్థాయికి చేరిందని కాటారం సభను చూసినవారంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై, పార్టీలో చేరిన జీవన్‌రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు వేదిక మీదున్న మంత్రులను కూడా ఆశ్చర్యానికి, కలవరానికి గురిచేశాయి. రేవంత్ హావభావాలు, ప్రయోగించిన భాష, చేసిన ఆరోపణలు వారిని విస్తుగొలిపాయి. రాజకీయాల్లో బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేత హుందాతనం ప్రదర్శించడానికి బదులు బజారుభాష మాట్లాడటంతో వారు ఇబ్బందులు పడ్డారు.
‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. నేనూ, పీసీసీ అధ్యక్షుడు కలిసి రాష్ట్రంలో 15 మంది ఎంపీలను గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తా.. కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్త.. బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా’ అని కాటారం వేదిక మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజల అభీష్టమే తప్ప ముఖ్యమంత్రులో, ప్రధానమంత్రులో అన్నీ డిసైడ్ చేయరని వాళ్లు గుర్తుచేస్తున్నారు. అయినా ఏ సీఎం ఎప్పుడుంటాడో, ఏ మంత్రి ఎన్నాళ్లుంటాడో, ఎప్పుడు ఎవరి పదవి ఊడుతుందో తెలియని కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, అధిష్ఠానం తప్ప ఆ పార్టీలో ఎవరూ ఏదీ డిసైడ్ చేయలేరనే విషయం రేవంత్‌కు తెలుసా? అని కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ సంగతి పక్కకు పెడితే, ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన పాపానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షహోదా దక్కుతుందా? ఆలోచించుకోవాలని హితవు చెప్తున్నారు. ప్రజాపాలన సభ పెట్టి ప్రజలముందు వెన్నుపోట్లు అంటూ మాట్లాడటం ద్వారా సాధించేదేముంటుందని ప్రశ్నిస్తున్నారు. వెన్నుపోటు గురువు సేవలో తరించిందెవరు? అని నిలదీస్తున్నారు.
‘తెలంగాణ పునర్నిర్మాణ దీక్ష’.. ఇదే ప్రజా ఆశీర్వాద సభ సందేశం. నూటికి నూరుశాతం రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభిస్తామని కేసీఆర్ తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ఈ సభావేదిక నుంచి ప్రకటించారు. దుర్మార్గ పాలన మీద సమరానికి ప్రజలను సన్నద్ధం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పదేండ్లపాటు దివారాత్రులు శ్రమించి అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టామని, ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ అన్ని రంగాలను సర్వనాశనం చేస్తున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన హయాంలో ప్రధాని మోదీ రైతుల మోటర్లకు మీటర్లు పెడ్తామంటే తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని తెగబడి నిలిచిన పోరాటాన్ని, ఇవ్వాళ సర్కార్ కరెంటు మీటర్ల ఏర్పాటుకు సంతకం చేసిన వైనాన్ని ప్రజల ముందుంచారు. తాము చెప్పిన మాట ప్రకారం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన విధానాన్ని, ఉద్యోగులకు 74శాతం పీఆర్సీ అమలు చేసి, రిటైర్డ్ ఉద్యోగులకూ వర్తింపచేసిన చరిత్రను, చేనేత, గౌడ, బీడీ కార్మికులను ఆదుకోవటంలోని నేపథ్యాన్ని కేసీఆర్ తన ప్రసంగంతో సూటిగా ప్రజల మనసులో నాటారు. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉంటే, ఏమి చేస్తే ప్రజలు శాశ్వతంగా ‘ఇదిరా.. నా తెలంగాణ’ అని సగర్వంతో తలెత్తుకొని బతికే రోజులు వస్తాయో వివరించారు. అందుకోసం బాధ్యతాయుత సమరనాదానికి ఎలా సిద్ధం కావాలో కర్తవ్యబోధ చేశారు.