హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రెక్కలను విరిచేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంపై ఆది నుంచి ఆర్థిక వివక్షను కొనసాగిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్న తెలంగాణను అడుగడుగునా వేధిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వకుండా కుంటి సాకులు చెప్తున్నది. ప్రతి విషయంలోనూ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతూ ఆర్థికంగా రాష్ర్టాన్ని అణగదొక్కాలని చూస్తున్నది.
గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధుల విడుదలలో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. సాధారణంగా కేంద్రం రెండు రకాలుగా రాష్ర్టాలకు సాయం అందిస్తుంది. వీటిలో కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా మొదటిది. రాష్ర్టాల్లో వివిధ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్ రెండవది. ఈ రెండింటిలోనూ బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. నామమాత్రంగా నిధులు అందించి చేతులు దులుపుకొంటున్నది. ప్రత్యేకించి గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణకు మొత్తంగా 31% మాత్రమే నిధులిచ్చిన మోదీ సర్కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి 7 నెలల్లో 9% నిధులు మాత్రమే విదిల్చింది.
గ్రాంట్-ఇన్-ఎయిడ్ విషయంలో బీజేపీ పాలి త రాష్ర్టాలకు ఒక న్యాయం, మిగిలిన రాష్ర్టాలకు మ రో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేంద్రం.. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు దేశంలోనే అ త్యధికంగా నిధుల వరద పారిస్తున్నది. 2023-24లో గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద గుజరాత్‌కు రూ.16,290 కోట్లు వస్తాయని ఆ రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా.. తొలి 7 నెలల్లోనే కేంద్రం ఏకం గా రూ.16,313 కోట్లు అందించింది. బీజేపీ అధికారంలో లేని తెలంగాణ, బీహార్ రాష్ర్టాలకు అంచనాల్లో 9% నిధులు మాత్రమే ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలలు మిగిలి ఉండడంతో గుజరాత్‌కు అంచనా కంటే 50% ఎక్కువ గ్రాంట్ అందవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.