నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 30 : యాసంగి సీజన్లోనూ యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. క్యూలో గంటల తరబడి నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం సుమారు 300 మంది రైతులు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. దీంతో పీఏసీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చి కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, పిండిప్రోలు, జూపెడ రైతులు యూరియా కోసం ఇబ్బందులుపడ్డారు. నాగర్కర్నూల్ పీఏసీఎస్ వద్ద ఒక్కో రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా నూకపల్లి సహకార సంఘానికి 450 బస్తాల లోడ్ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే భారీగా తరలివచ్చారు. ఎకరానిక ఒక బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు నిరాశచెందారు.
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి రైతు వేదిక వద్దకు యూరియా కోసం రైతులు బారులుతీరారు. సండ్రాళ్లగూడెంలో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. మల్యాల, వేంనూరు, జంగిలికొండ, అమనగల్ రైతు వేదిల వద్ద క్యూకట్టారు. డోర్నకల్ సొసైటీ, గ్రోమోర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలతోపాటు గూడూరు పీఏసీఎస్ వద్ద బారులుతీరారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లి జీపీ కార్యాలయం వద్ద పోలీస్ పహారా నడుమ యూరియా పంపిణీ చేశారు. ఖానాపురం మండలం మనుబోతులగడ్డ జీపీ కార్యాలయానికి ఉదయం 3 గంటలకు వచ్చి న రైతులు చలికి వణుకుతూ ఇబ్బందిపడ్డారు. నెక్కొండ మండలం సూరిపల్లిలో టోకెన్ల కోసం బారులుతీరారు. పిల్లలను సైతం వెంటబెట్టుకొని రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.