Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అధికారులు, పౌరులకు పదవులు పొందడానికి తెలంగాణ రాష్ట్రం పునరావాస కేంద్రంగా మారిందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కీలకమైన పదవుల్లో ఏపీకి చెందిన వారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పాలకులు ప్రభుత్వ పదవులను ఆంధ్రప్రదేశ్ వారికి ఇస్తూ తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఏపీకి చెందిన వా రిని నియమించారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డిని బుద్ధవనం ప్రాజెక్టు పర్యవేక్షకుడిగా ప్రభుత్వం నియమించింది.
ఆగస్టు 19న జీవో విడుదలైనా దానిని బయటికి రాకుండా రహస్యంగా ఉంచి శనివారం బయటపెట్టారు. ఆంజనేయరెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి. తెలంగాణతో, తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని అధికారి. ఆయనను ఏరి కోరి తెచ్చుకోవడంపై తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ను రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారుడిగా నియమించారు. ఏపీకి చెం దిన మాజీ ఐఏఎస్ శ్రీనివాస్‌రాజు స్వచ్చంద పదవీ విరమణ చేయగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. అసెంబ్లీ సలహాదారుడిగా అయ్యదేవర ప్రసన్నకుమార్‌ను నియమించారు. ఇటీవలే రెడ్కో ఎండీగా అనంతపురానికి చెందిన అనిల వావిల్లకు పోస్టింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) డైరెక్టర్ జనరల్‌గా ఏపీకి చెందిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నియమితులయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి ప్రతిభ ఉన్నా అణచివేశారని, నాడు ఎంతో నష్టపోయామని, ఇప్పుడు కూడా నష్టపోవాల్సిందేనా అంటూ తెలంగాణవాదులు వాపోతున్నారు. తెలంగాణ సాధించుకున్నదే ఇక్కడి వారికి అవకాశాలు రావడానికి అని, అర్హులు, మేధావులు, ప్రతిభ ఉన్న వారు ఇక్కడ లేరా అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చినంక కూడా కాంగ్రెస్ వాళ్లు.. ఏపీ వాళ్లే ముద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి కూడా వెన్నుపూస లేనివారుగా వ్యవహరించే వారని, అదే సంస్కృతిని ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీ నేతల అధిపత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తాజా పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఇప్పటికైనా మార్పు రావాలని, లేకుంటే తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ పదవులే కాకుండా చివరికి పార్టీ పదవులను కూడా కాంగ్రెస్ నేతలు ఏపీ వారికి ఇస్తున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని నియమించారని ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వారు ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో వ్యవహరించాలని, రిమోట్ కంట్రోల్ ద్వారా కాకుండా స్వతంత్రంగా, ప్రజల ప్రయోజనాలు రక్షించే విధంగా ఉండాలని సూచిస్తున్నారు.