హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలి శవాలు మాయం చేసే రాజకీయాలు నడుపుతున్నది. సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని మృతుల కుటుంబాలకు పరిహారం ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పాలకులు కుట్రలు చేస్తున్నారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
వలస కూలీల శవాలపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, ఇంతియాజ్, నాయకులు కిషోర్‌గౌడ్, గౌతంప్రసాద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సిగాచి అగ్నిప్రమాద ఘటన జరిగి నెలరోజులు దాటినా ఆ కంపెనీపై కేసు ఎందుకు పెట్టలేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోటి పరిహారాన్ని పంచుకొనేందుకే వారితో కుమ్మక్కయ్యారా? ఉదాసీనత ఎందుకు? అని ప్రశ్నించారు.