వనపర్తి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఐదు విడతల్లో రైతు భరోసా వేయాల్సిన పాలకులు కేవలం ఒక్కసారే వేసి రైతులను నిట్టనిలువునా ముంచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి వరినాట్లు మొదలైనా ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అబద్ధపు హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన రెండేండ్లపాటు మోసాలతో సాగిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతుంటే పాలకులకు చీమ కుట్టినట్టుకూడాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్టపాలన చూసిన ఓటర్లు గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రెండు, మూడో విడతల్లోనూ రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు సి ద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.