ఖైరతాబాద్, డిసెంబర్ 12 : బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణాలు అర్పించిన బీసీ బిడ్డ ఈశ్వరాచారి ఆత్మబలిదానం వృథా కాదని, ఆయన రెండు కోట్ల మంది బీసీలకు స్ఫూర్తిదాతగా నిలిచాడని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన ఈశ్వరాచారి సంతాపసభకు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఈశ్వరాచారి పేదరికంలో జీవించాడని, కిరాయి ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడని, ఆయన చనిపోయిన తర్వాత కనీసం మృతదేహాన్ని కూడా ఆ ఇంటి యజమాని రానివ్వలేదని, ఈ విషయంలో పోలీసులు సైతం కుట్రచేశారని పేర్కొన్నారు. నిలువ నీడలేని ఈశ్వరాచారి రెండు కోట్ల మంది బీసీల సమస్యపై పోరాడుతూ ఆత్మబలిదానం చేసుకున్నట్టు గుర్తుచేశారు.
ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించాడని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి పైశాచిక, వికృత విన్యాసం చేశాడని ఎద్దేవా చేశా రు. ఈశ్వరాచారి చనిపోతే ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ వచ్చి పరామర్శించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కండ్లులేని, కాళ్లులేని, దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నదని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి బీసీలను వంచించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం రూ.2కోట్లతోపాటు ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి మరణం మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిందని, నేడు ఈశ్వరాచారి ఆత్మబలిదానం కూడా వృథా కాద ని పేర్కొన్నారు. గడిచిన 75 ఏండ్లలో బీసీ వర్గం అత్యధికంగా నష్టపోయిందని, సా మాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేతకు గురైనట్టు తెలిపారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని తట్టుకోలేకనే ఈశ్వరాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడని ఆరోపించారు.
అనంతరం ఉప్పల్‌భగాయత్ ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ చైర్మన్ లాల్కోట వెంకటాచారి, ఈశ్వరాచారి పిల్లల చదువు కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. వింజమూరి రాఘవాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షుడు కందారం గణేశ్‌చారి, అయిలి వెంకన్నగౌడ్, మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, తెలంగాణ స్వర్ణకార సం ఘం ప్రధాన కార్యదర్శి రేవూరి వెంకటస్వామి, కోశాధికారి జీ చంద్రశేఖర్, మదన్మోహన్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు పిడికిలి రాజు, ఎర్రోజు వేణుగోపాల్, మారోజు జంగాచారి, దాసోజు లలిత, ఈశ్వరాచారి తల్లి ప్రమీల, సోదరుడు నందీశ్వర్, కుమార్తె కృతిక పాల్గొన్నారు.