Cash for Vote Case | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఓటుకు నోటు కేసు విషయంలో సోమవారం జరిగిన వాదనలు సక్రమంగానే ఉన్నాయని.. ఈ కేసులో కేవలం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రమే కాకుండా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. నాటి ప్రభుత్వం ఓటుకు నోటు కేసు పెట్టినందుకే.. కౌంటర్‌గా అప్పటి ఏపీ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్ కేసు పెట్టిన విషయాలను తెలంగాణ న్యాయవాది మేనక గురుస్వామి సుప్రీంకోర్టుకు చెప్పడం మర్చిపోయారని తెలిపారు. కాబట్టి త్వరలో ప్రకటించబోయే తుది తీర్పులో పలు విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని లేఖరాస్తున్నట్టు తెలిపారు.
చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి
‘మీ తీర్పును ప్రకటించే ముందు, కేసుకు సంబంధించి నా ప్రమేయంతోపాటు నన్ను ఈ నేరానికి ప్రోత్సహించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, అతని కుమారుడు నారా లోకేశ్, టీడీపీ నాయకులు, గతంలో ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, న్యాయవాదులు, వారికి సహకరించిన ప్రతి ఒకరిని, నిందితులుగా చేర్చగలరు. చట్టప్రకారం అందరిపై వెంటనే కేసులు నమోదు చేసి, నాతోపాటు వారిని అరెస్టు చేసి, నా పాత్రతోపాటు వారి ప్రమేయాన్ని కూడా పూర్తిగా సమగ్రంగా విచారించి, కఠినంగా శిక్షించగలరు’ అని మత్తయ్య సీజేఐని కోరారు.
చంద్రబాబు, రేవంత్ నన్ను ప్రోత్సహించారు
‘2016లో చంద్రబాబునాయుడు, అప్పటి టీడీపీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి నన్ను పిలిపించి ఓటుకునోటు కేసు విషయం నాకు వివరించారు. ఒక పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ఓటును, మరొక రాజకీయపార్టీకి అనుకూలంగా వేసి నమ్మకద్రోహం చేసే నేరానికి నన్ను ఒప్పించారు. రూ.5 కోట్ల డబ్బులకు నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను ఒప్పించాలని నన్ను ప్రోత్సహించారు. నాడు నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సహా ఇతరుల అందరి పాత్రను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీరు ఇచ్చే ఈ తీర్పు అన్ని రాష్ట్రాల్లోని, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు డబ్బు, పదవులు ఆశ చూపి, ప్రలోభ పెట్టి కొనుగోలు చేయకుండా ఆయా నియోజకవర్గ ఓటర్ల మనోభావాలను కాపాడండి’ అని వేడుకున్నారు.
రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలి
‘ఈ కేసులో నాతో సహా నిందితులందరినీ విచారించే విధంగా క్వాష్ పిటిషన్‌ను రీఎంక్వైరీ చేయాలి. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి అతని సహచరులు వేం నరేందర్‌రెడ్డి, వేం కీర్తన్‌రెడ్డి, ఉదయ్‌సింహా తదితరులు ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతున్నారు. దీంతో ఈ దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, దర్యాప్తు తప్పుదోవ పట్టకుండా, దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులను వేరేలా ప్రభావితం చేయకుండా సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. అందుకోసం తక్షణమే ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ వారి పదవులు, అధికారాల నుంచి తప్పించాలి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలి. వేంనరేందర్‌రెడ్డి, ఉదయ్‌సింహాను పదవుల నుంచి తప్పించి, విచారణ ముగిసే వరకు వారి హోదాలకు దూరంగా ఉంచాలని ఆదేశాలు ఇవ్వండి’ అని మత్తయ్య కోరారు.
కేసును మొదట్నుంచి విచారించాలి..
‘ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తులో కనుగొన్న అన్ని అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు సెల్‌ఫోన్, కాల్ రికార్డు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 50 లక్షల నగదు, ఆ నగదు సేకరించిన, సమకూర్చిన నిందితులు అన్నింటిపై మొదట్నుంచి దర్యాప్తు చేయాలి. నేను తెలంగాణ పోలీసులకు, ఏసీబీ అధికారులకు దొరకకుండా నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. నా కాళ్లు చేతులు కట్టేసి, కండ్లకు గంతలు కట్టి, కారు డికీలో తరలించిన నారా లోకేశ్ సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీబాబులపై చర్యలు తీసుకోవాలి. విజయవాడ పరిసరాల్లో సుమారు 6-7 నెలలు నన్ను అజ్ఞాతంలో ఉంచి, నా భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు మా ఇంటి సభ్యులకు చూపించకుండా, నా క్రైస్తవ సమాజానికి దూరం చేశారు. తెలంగాణ పోలీసులకు దొరకకుండా ఆంధ్రాలో పలు ప్రదేశాల్లో రహస్యంగా చీకటి గదిలో బంధించి, అడవులలో నన్ను నిర్బంధించి వేధించిన పోలీసు అధికారులు, నాకు కాపలా కాసిన అప్పటి ఏపీ పోలీసు ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ డీజీపీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఏసీపీ, కేవీఎన్‌ఎస్ ప్రసాద్, కృష్ణాజిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వారికి సహకరించిన క్యాబినెట్ మంత్రులందరినీ కూడా ఓటుకు నోటు కేసులో దోషులుగా గుర్తించి నిందితులుగా కేసు నమోదు చేసి, విచారించాలి.
కేసీఆర్, కేటీఆర్‌పై తప్పుడు స్టేట్మెంట్లు రాయించారు
‘నాతో విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ల మీద ఫోన్‌ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయించారు. ఎల్విస్ స్టీఫెన్సన్ నా వ్యక్తిగత పనుల కోసం కలిసినట్టు నాతో బలవంతంగా స్టేట్మెంట్ రాయించారు. అప్పుడే సుమారు 100కు పైగా తెల్ల పేపర్లు, వకాలత్ పేపర్లపైన సంతకాలు పెట్టించుకున్నారు. నాకు తెల్వకుండా క్వాష్ పిటిషన్ వేసేందుకు నన్ను నమ్మించారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, నాకు అమరావతిలో ఇల్లు, వ్యాపార అభివృద్ధికి ఆర్థికంగా సహకరిస్తామని, నా పిల్లల చదువుల విషయంలో వారి భవిష్యత్తుకు సహకరిస్తామని నమ్మించారు. వారు నాడు చెప్పిన అబద్ధాలతో 164 పిటిషన్ వేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమేడల, దమ్మాలపాటి మరికొందరు ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్‌లు, న్యాయవాదులు వారికి సహకరించిన అందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చి విచారణ చేయాలి’ అని మత్తయ్య కోరారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను రద్దు చేయాలి
‘ప్రజాప్రతినిధుల ఓట్లను కొనుగోలు చేయడం, ప్రలోభపెట్టడం వంటి నేరానికి పాల్పడిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను తక్షణమే రద్దు చేయాలి. అన్ని ఎన్నికలలో ఆ పార్టీలు పాల్గొనకుండా బహిషరించాలి. ఆ పార్టీల ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తక్షణమే రద్దు చేయాలి’ అని మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి శివశంకర్ కూడా నిందితుడే
‘నాటి క్వాష్ పిటిషన్లో ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టి.. ఆధారాలు సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించకుండా, సాక్షుల వాంగ్మూలాలు తీసుకోకుండా కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని, నా ప్రమేయాన్ని ధ్రువీకరించకుండా, నిజాలను, సాంకేతిక ఆధారాలను తిరసరించి పిటిషన్‌ను క్వాష్ చేసిన హైకోర్టు జడ్జి శివశంకర్‌ను కూడా నిందితునిగా చేర్చాలి. జస్టిస్ శివశంకర్ రిటైర్మెంట్ తర్వాత తెలంగాణలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత పోలీసు విజిలెన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. క్విడ్‌ప్రోకో జరిగిందనడానికి ఇది బహిరంగ సాక్ష్యం. అప్పుడు ఏసీబీ అధికారులుగా ఉన్న పోలీసులు.. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు చేసిన ఐపీఎస్ అధికారులు కూడా కుమ్మకై కేసును నిర్వీర్యం చేసి, కేసును క్వాష్ చేసేందుకు సహకరించారు. కాబట్టి వారిని కూడా నిందితులుగా నమోదు చేసి విచారించాలి’ అని మత్తయ్య డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ను కూల్చాలనుకోవడం నేరం..
‘ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. ఎన్నికల్లో పోటీ చేసి, పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంతో కష్టపడింది. అటువంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయల డబ్బు ఆశ చూపి ప్రజలచేత తిరసరించబడిన టీడీపీ రాజ్యాంగ బద్ధంగా గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడం అత్యంత ఘోరమైన పాపం, నేరం. ఈ ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీని కూలదోసేందుకు కుట్రపూరితంగా నాడు ఎమ్మెల్యేలకు, నా ద్వారా డబ్బులు ఆశ చూపారు. టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర చేసిన వారందరినీ, తక్షణమే వారివారి పదవుల నుంచి తొలగించి దర్యాప్తు చేయవలసిందిగా తీర్పు ఇవ్వండి. తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన మొదటి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన అప్పటి టీడీపీ, దానికి పరోక్షంగా సహకరించిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలు రెండూ శిక్షార్హమైనవే. ఓటుకు నోటు కేసులో పూర్వాపరాలను, దానికి అనుసంధానంగా ఉన్న టెలిఫోన్ టాపింగ్ కేసు, వాయిస్ పిటిషన్ తర్వాత జరిగిన అధికార దుర్వినియోగం మొదలగు విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని సమర్థమైన తీర్పునివ్వాలి’ అని మత్తయ్య సీజేఐకి విజ్ఞప్తిచేశారు.
నన్ను అప్రూవర్‌గా గుర్తించండి
నేను రాస్తున్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్తాను. నన్ను అప్రూవర్‌గా అనుమతించాలని నాలుగేండ్ల కిందట సుప్రీంకోర్టులో ‘పార్టీ ఇన్ పర్సన్’ పిటిషన్ వేశాను. అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న చంద్రబాబు అనుచరుడు లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టులో అమికస్ క్యూరీగా వారికి అనుకూలంగా ఉన్న న్యాయవాదిని నియమించి, నన్ను మాట్లాడకుండా చేసి నిజాలను తొకి పెట్టారు. అందుకే అత్యున్నత న్యాయస్థాయనమైన సుప్రీంకోర్టు ద్వారా చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో ఇదే ఒకటో నంబర్ కోర్టులోనే ఓటుకు నోటు కేసు విచారణ చేయాలని నేను కోరుతున్నాను. లేదంటే తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకుండా ఢిల్లీ హైకోర్టులో లేదా మరే ఇతర రాష్ట్ర హైకోర్టులోనైనా ఈ విచారణ చేపట్టే విధంగా సత్వరమే ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి. ఒక బాధ్యతయుతమైన సాధారణ పౌరునిగా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న ఓటుకు నోటు కేసు నిందితుడిగా ఉండి, చేసిన తప్పుకు సిగ్గుపడి ప్రాయశ్చిత్తపడుతున్నాను. నా తప్పు తెలుసుకుని ఇకనైనా నా వంతుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చిన్న ప్రయత్నం చేస్తున్నాను’ అని మత్తయ్య సుదీర్ఘ వివరణ ఇచ్చారు.