హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, సీఎం రేవంత్రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 7న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు-వేయి గొంతుకలు కార్యక్రమానికి వాయిదా వేయించడంలో రేవంత్ సర్కార్ సఫలమైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, నరేందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రూప్లవారీగా కులాలను ఎంపిక చేసినందున మాదిగలు సంబురాలు చేసుకునే పరిస్థితి లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణకు సాధికారత వచ్చినా రేవంత్ సర్కారు చర్యలతో ఎదిగిన కులాలకే న్యాయం జరిగిందని మండిపడ్డారు. మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ దకేదాకా పోరాడుతామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ఎప్పుడూ మాదిగలకు వ్యతిరేకమే: ఎర్రోళ్ల శ్రీనివాస్
కాంగ్రెస్ ఎప్పుడూ మాదిగలకు వ్యతిరేకమేనని, సుప్రీంకోర్టు తీర్పే కాంగ్రెస్ మెడలు వంచిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు ఎస్సీ వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకోవడంలో అర్ధం లేదని విమర్శించారు. బీజేపీ కూడా పదేండ్లు ఎస్సీలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలకు కూడా ఎస్సీ వర్గీకరణ పాటించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, పథకాల్లో ఎస్సీ వర్గీకరణను పాటించాలని కోరారు. కేసీఆర్ హయాంలో ఎస్సీలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ అంతా మందకృష్ణ మాదిగకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.