Errolla Srinivas | హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చెడ్డీ గ్యాంగ్ మాదిరి ఇది వలసల గ్యాంగ్ అని విమర్శించారు. ఈ పదేండ్లు అన్ని రకాల పదవులు అనుభవించి, ఇవాళ పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
తీర్థయాత్రలు తిరిగి ఇంటికి వెళ్తున్నాం అని కేకే అంటున్నారు. ఈ మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుంది. రాజకీయాలు నేటి తరానికి ఆదర్శంతంగా ఉండాలి. మీకు టీఆర్ఎస్ పార్టీ తీర్థయాత్రలాగా కనబడుతుందా..? 85 ఏండ్ల వయసులో ఉన్న రాజకీయ కురవృద్ధులు ఇలా మాట్లాడం మంచిది కాదు. మరి కాంగ్రెస్ నుంచి కాశీకి పోతారు అది గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రంలో పార్టీలు మారే నాయకులు కొంతమంది ఉంటారు. హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ మాదిరిగా ఇలా పార్టీలు మార్చే గ్యాంగ్ ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తుంటారు. అక్కడ కష్టపడి పని చేసే నాయకులకు అవకాశాలు రానివ్వకుండా వాటన్నింటినీ ఈ వలస నేతలు లాగేసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండే యువ నాయకత్వం నిరసన వ్యక్తం చేయాలి. అధికారం కోసం మీరంతా కష్టపడ్డారు. కానీ ఇలా పార్టీలు మారే వారి వల్ల నష్టం కలుగుతుంది. రాజకీయ ద్రోహులు.. ఇలాంటి వారు ఎక్కడున్న ప్రమాదమే. రాజకీయాలకు కొత్తదనం తీసుకురావాలి కానీ.. ఇలా పార్టీలు మారి రాజకీయాలను భ్రష్టు పట్టించకూదన్నారు. నాయకులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.
కడియంను చూసి తెలంగాణ ప్రజలు అస్యహించుకుంటున్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ అపారమైన గౌరవం ఇచ్చారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా గత కొద్ది రోజుల నుంచి కడియం వ్యవహరించారు. తాను గొప్ప నాయకుడిని అని కడియం శ్రీహరి అనుకుంటున్నారు. సొంత ఇమేజీ మీద గెలిపించే శక్తి ఉందా..? వయసు పెరిగిన ప్రతి వ్యక్తి మేధావి అనుకుంటే పొరపాటు. దానికి కొన్ని విలువలు ఉంటాయి. మీకు రాజకీయంగా విలువలు ఉన్నాయకుంటే పొరపాటు. మీరంత స్వార్థపరులు, పవర్ బ్రోకర్లు. ఇలాంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఎస్సీల గురించి ఏనాడూ మాట్లాడలేదు. వ్యక్తిగత జీవితంపైనే కడియం శ్రీహరికి ధ్యాస. టీడీపీలో ఉన్నప్పుడు కేడర్‌ను ఎదగనివ్వలేదు. బీఆర్ఎస్లో కూడా ఎదగనివ్వలేదు కడియం. ఇన్ని సంవత్సరాల నీ రాజకీయ జీవితం నీ పర్సనల్‌కు మాత్రమే ఉపయోగపడింది. ఇలాంటి వ్యక్తులను రాళ్లతో కొట్టిన పాపం లేదు. ఇది మంచి వాతావరణం కాదు. తెలంగాణ సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి అని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.