Errolla Srinivas | హైదరాబాద్ : కే కేశవరావు, కడియం శ్రీహరి.. ఊసరవెల్లి, పాము లాంటోళ్లు అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఊసరవెల్లి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తదట. పాము గడ్డు సమయంలోనే తనను ఎవరైనా కొట్టి చంపుతారని అనుకున్నప్పుడు అది పడగ విప్పి కాటేస్తదట. కేకే, కడియం ఈ రెండింటి కంటే ప్రమాదకరం అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
కుర వృద్ధులైన కేకే, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, అవకాశాలు పొంది ఇవాళ పార్టీ మారుతుంటే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో వెంటిలేటర్ మీద ఉన్న వీళ్లకు కేసీఆర్ ఆక్సిజన్ ఇచ్చి బతికించుండు. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న ఈ లీడర్లకు ఏముండే. కడియం శ్రీహరిని 2014లో వరంగల్ ఎంపీని చేశాం. 2016లో ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎం ఇచ్చాం. అదే విధంగా 2021లో ఎమ్మెల్సీ రెన్యువల్ చేశాం. 2023లో ఎమ్మెల్యేను చేశాం. అది కూడా ఎమ్మెల్సీ పదవి కాలం నాలుగేండ్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యేను వదిలేసి కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. నా బిడ్డకు(కడియం కావ్య) టికెట్ కావాలంటే వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించారు కేసీఆర్. ఇవాళ గమ్మత్తు ఏంటంటే.. రాజకీయాలకు విలువలు ఉన్నాయా..? అనిపిస్తుంది. మార్చి 27న కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు కడియం కావ్య. 28న సాయంత్రం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఉత్తరం రాశారు అని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
కడియం శ్రీహరి తన 50 ఏండ్ల రాజకీయ సీనియారిటిని ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారని అనిపిస్తుంది. కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో.. రాజయ్య, ఆరూరి రమేశ్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు. కడియం వల్ల ముగ్గురి వ్యక్తులను కోల్పోయాం. అయినా ఇవాళ పార్టీని డ్యామేజ్ చేశారు. కేసీఆర్ను పూర్తిగా మోసం చేశారు. ఇది విలువల్లేని రాజకీయం. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కడియం పార్టీ మారారు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం. వీళ్లను పవర్ బ్రోకర్లు అనాలా..? రియల్ బ్రోకర్లు అనాలా..? అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన నాయకులం మేం. తెలంగాణ కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, ప్రజా సేవ కోసం పాటుపడాలని కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నాం. మీలాంటి వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేశాం. మేం త్యాగాలు చేసి మీకు పదవులు అప్పజెప్తే.. మీరేమో భోగాలు అనుభవించి ఇప్పుడు పార్టీని తిడుతున్నారు. ఇది సరికాదు. ఇవాళ మీ వల్ల వరంగల్ జిల్లాలో ఎంతో నష్టం జరిగిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.