హనుమకొండ, మే 6 : వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి దిగి వచ్చేవరకు రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్‌రోడ్డులో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో కళ్లాల దగ్గరకు వచ్చి మక్కలు, తడిచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, నేడు కాంటాలు వేసేందుకు ఎంత ఇస్తావని అడుగుతున్నారని, ట్రాన్స్‌పోర్టుకు రూ. 100 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్‌లో రైతు సదస్సు పెట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చే ఏ పిలుపుకైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రైతు మేళా నిర్వహించడం కాదని, వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పెడితే అన్నదాతలు ఉరికించి కొడతారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే మార్కెట్‌కు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని చెప్పారు. ఏ ఒక్క రైతు సంతోషంగా ఉన్నామని చెప్పినా ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. మక్కలు, వడ్ల కొనుగోలు విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిగిరాకపోతే .. మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి దుమ్ములేపుతారని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది రాబందుల పాలన అని, రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రైతు సంగ్రామ సదస్సులో ఆమె మాట్లాడతూ.. మండుటెండను సైతం లెక్క చేయకుండా సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రైతు బిడ్డగా కేసీఆర్ రైతులు తమ కాళ్లపై తాము నిలబడేలా చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పండిన పంటను పావలా వంతు కూడా కొనుగోలు చేయలేడంలేదని మండిపడ్డారు. మక్కలు, వడ్లు కొనేవాళ్లు లేక కళ్లాలు, కేంద్రాల వద్ద రైతులు కన్నీళ్లు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల కన్నీళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. రైతులు సంతోషంగా ఉండాలంటే రాబందుల పాలన పోయి రైతుబంధు పాలన రావాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ సభలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తాము రైతు సంగ్రామ సదస్సు పెడితే .. కాంగ్రెస్ మెగా రైతు మేళా పెట్టిందని ఎద్దేవాచేశారు. కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెట్టగానే అదే రోజు రేవంత్‌రెడ్డి మేడిగడ్డలో ఎకరానికి రైతు భరోసావేసి మంత్రులు సీఎంతో అలయ్ బలయ్ తీసుకున్నారని చెప్పారు. గత రెండున్నరేండ్లలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన రైతు హత్యలేనని వెల్లడించారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు 11 విడుతల్లో రూ. 72 వేల కోట్లు నేరుగా ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రూ. 1500 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్ రామప్ప నుంచి ఉనికిచర్ల వరకు తవ్వించి, ధర్మసాగర్ వద్ద మూడు భారీ మోటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. సమ్మక సాగర్‌ను తుపాకులగూడెం వద్ద నిర్మించి, దేవాదుల ద్వారా 3.47 లక్షల ఎకరాలకు సాగునీరందించారని వెల్లడించారు. కాకతీయ కాలువకు రూ. 1,000 కోట్లు కేటాయించి డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట వరకు సాగునీరందించిన ఘనత కేసీఆర్‌దేని చెప్పారు. వరంగల్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 70 నుంచి 80 శాతం సాగు భూమిగా మారిందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పవిత్ర గడ్డ వరంగల్ నుంచే రైతు ఉద్యమ పోరాటం ప్రారంభమైందని చెప్పారు. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రూ. 2 వేల కోట్లు మంజూరు చేసి దేవాదుల పూర్తి చేయాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.