హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): శంషీగూడలో ని 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూ ఆక్రమణల ఆరోపణలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శంషీగూడ భూవ్యవహారంలో దాగి ఉన్న నిజానిజాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు సుప్రీంకోర్టులో సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయపోరాటం చేయాలని, బలమైన వాదనలు వినిపించి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెరనుంచి కాపాడాలని కోరారు.