పాలకుర్తి రూరల్, జూలై 17: తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తిలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. వానకాలం పంట పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుణ మాఫీపై కాంగ్రెస్ పాలకులు కొర్రీలు పెడుతున్నారని మొండిపడ్డారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతామని హెచ్చరించారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.