దేవరుప్పుల, ఫిబ్రవరి 24: ‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. పాలకుర్తి నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెడుతున్న కేసులుపై వడ్డీతోపాటు తిరిగి చెల్లిస్తాం’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులపై మాట్లాడారు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఎన్ని సీట్లు వస్తాయనే విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టి పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, కరోనా కష్ట కాలాన్ని లెక్క చేయక రైతుభరోసా అన్నదాతల ఖాతాలో వేసిన ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తుచేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయిస్తూ కూర్చున్న చందాన పాలకుర్తిలో పాలన సాగుతున్నదని విమర్శించారు.
పాలకుర్లిలో ఎండిన పంటలు, రైతుల ఆవేదన చూస్తుంటే ఎంతో బాధేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై తహసీల్దార్, ఎస్సైని నిలదీస్తే వారిపై కేసులు పెట్టిస్తారా అని ప్రశ్నించారు. ఏ సమయంలోనైనా రేవంత్ సర్కారు కూలవచ్చని జోస్యం చెప్పారు.