రాయపర్తి, ఏప్రిల్ 18 : అబద్ధాల పునాదులపై నిర్మితమైన రేవంత్‌రెడ్డి సర్కార్ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన నడుమ ఊగిసలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవాచేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసత్యపు హామీలు, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సర్కార్ 16 నెలలుగా రాష్ట్రంలోని అన్నివర్గాలతో ఛీత్కరింపులకు గురవుతున్నదని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుడో… ప్రభుత్వం కూలుడో తప్పక జరుగుతుందని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల సబ్బండ వర్ణాల ప్రజల ఆకాంక్ష మేరకు పురుడుపోసుకున్న గులాబీజెండా, కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. రజతోత్సవ సభ ఏ విధంగా ఉండబోతోందన్న ఆసక్తితో ప్రపంచం ఎదురుచూస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, గుడిపూడి గోపాల్‌రావు, మండల నాయకులు పాల్గొన్నారు.
ఓరుగల్లుకు దండులా కదలాలి ;మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట, ఏప్రిల్ 18 : ఓరుగల్లులో జరగనున్న బీఆర్ఎస్ సభకు పార్టీ శ్రేణులు దండులా కదలాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గులాబీ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న సభకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. నియోజకవర్గం నుంచి 30 బస్సులు, 155 వాహనాలు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. సభకు వెళ్లేరోజు ఉదయం 6 గంటలకు బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలన్నారు.
దారులన్నీ సభ వైపే సాగాలి ; మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి, ఏప్రిల్ 18 : ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైపే దారులన్నీ సాగాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 27న జరిగే సభకు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమానులను భారీగా తరలించాలని సూచించారు. అదే రోజు ఉదయం గ్రామాల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలని, గ్రామా ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండలానికి ఐదు బస్సుల చొప్పున ఏర్పాటు చేశామని వెల్లడించారు. సభను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
సభను విజయవంతం చేయాలి ; కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం
వీపనగండ్ల, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర నేత అభిలాష్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లి కేసీఆర్ ఇచ్చే స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వినడానికి సిద్ధం కావాలన్నారు. బయలుదేరే ముందు బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.
పల్లెల్లో గులాబీ జెండా ఎగరాలె ; మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 18: బీఆర్ఎస్ 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న ఉదయం ప్రతి పల్లెలో గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలహిల్స్‌లోని స్వగృహంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుంచి గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు. సభకు తరలివెళ్లేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా గడిపారని గుర్తు చేశారు.