దేవరుప్పుల, నవంబర్ 5: సన్నాలకు రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోలు ప్రారంభించినా చాలని రైతులు అనుకుంటారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలలోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవా రం ఆయన పరిశీలించగా, రైతులు తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా నేటికీ కొనుగోలు జరగడం లేదని మండిపడ్డారు.
రైతులు ఇప్పటికే రేవంత్రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై నమ్మకాన్ని కోల్పోయారని, సన్నాలపై బోసన్ ఇస్తారనే నమ్మకం రైతులకు లేదని అన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి వారం రోజులు దాటుతున్నదని తెలిపారు.
రైతులు సన్న ధాన్యాన్ని తీసుకొచ్చినా, సన్న ధాన్యమని నిర్ధారించే పరికరం లేక కొనడం లేదని నిర్వాహకులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సన్న వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా అమలయ్యే వరకు రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతామని స్పష్టం చేశారు.