తొర్రూరు, ఫిబ్రవరి 17: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై పట్టణ ఓట ర్లు అనుమానించినట్టుగానే జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన పడ్డట్టుగానే అక్రమం చోటుచేసుకున్నది. పట్టణ ఓటర్లు మెజారిటీ కౌన్సిలర్లను బీఆర్ఎస్కు కట్టబెట్టారు. ఎక్కువ మంది ఉన్న కౌన్సిలర్ల నుంచే చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలని బీఆర్ఎస్ చేసిన విన్నపాలపై అధికార కాంగ్రెస్ విషం చిమ్మింది. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదని అధికారుల వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాదన అరణ్యరోదనే అయింది. అక్రమాలు, అరాచకాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను హస్తగతం చేసుకొన్నది. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకొన్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా బీఆర్ఎస్కు చైర్మన్ పదవి దకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ బలగాలను అడ్డంపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
వరంగల్ లోక్‌సభ సభ్యురాలైన కడియం కావ్య గతంలోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓటు నమోదు చేసుకున్నారు. తొర్రూరులో కూడా ఓటు హకు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ 3వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి రవి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఎంపీ కడియం కావ్య సహా ఏడుగురు కౌన్సిలర్లు చేరుకున్నారు. బీఆర్ఎస్కు 9 ఓట్లు నమోదు కాగా, కాంగ్రెస్‌కు ఏడు ఓట్లకు తోడు రెండు ఎక్స్అఫీషియో ఓట్లు చేరడంతో 9 ఓట్లు నమోదయ్యాయి. సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి తునం శ్రావణ్ చైర్‌పర్సన్‌గా, సోమ రజిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడిన నేపథ్యంలో పట్టణం మొత్తం పోలీస్ బందోబస్తుతో అష్టదిగ్బంధనం చేశారు. ఉదయం 5 గంటల నుంచే సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందితో, మూడు జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహించడం పట్టణ ప్రజల్లో ఆందోళనకు దారితీసింది. బీఆర్ఎస్కు చైర్మన్ పదవి దక్కవద్దనే అక్కసుతోనే అధికార పార్టీ పోలీసు జులుం ప్రదర్శించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. ఎంపీ కడియం కావ్యకు ఎక్స్అఫీషియో ఓటు నమోదు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్టుపై మండిపడ్డారు. మున్సిపల్ ఆఫీసు గేటు ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు.

దేవరుప్పుల, ఫిబ్రవరి 17 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీని ఎన్నికల ఫలితాల రోజే బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, మాజీ మంత్రి ఎర్రబెల్లిని అక్కడి ప్రజలు ఆదరించారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల బీఆర్ఎస్ కా ర్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్ది ద యాకర్‌రావు నేతృత్వంలో జరిగిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. తొర్రూ రు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సీఎం రేవంత్ డైరెక్షన్లో జరిగిందని, అధికారుల ను అడ్డుపెట్టుకుని, ఎన్నికను లైవ్‌లో చూపకుండా దొంగాట ఆడారని. ఈ ఎన్నికలు అత్తా కోడళ్లు ఝాన్సీరెడ్డి, యశస్వినీరెడ్డి అధికార దాహానికి పరాకాష్ట అని చెప్పారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య నిబంధనలు ఉల్లంఘించి, అప్రజాస్వామికంగా తొర్రూ రు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోగా ఓటేశారని విమర్శించారు. మున్సిపాలిటీ ఎక్స్అఫీషియోగా బీఆర్ఎస్ తరఫున తాము దరఖాస్తు చేసుకుంటే అధికారులు రిజెక్ట్ చేశారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా ఇప్పటికే కోర్టుకు వెళ్లి, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. వందలాది మంది పోలీసులు పట్టణంలో కవాతు చేస్తూ బీఆర్ఎస్ నేతలను అడుగడుగునా అడ్డుకున్నారని, మాజీ మంత్రి ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి నర్సింహులపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారని తెలిపారు. ఈ తతంగంపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.