వర్ధన్నపేట, మే 8 : రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీయిస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఐనవోలు, వర్ధన్నపేట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనేవిధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పడం వల్ల అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారని అన్నారు.
దీనివల్ల రానున్న రోజుల్లో నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన కూడా పదేళ్లపాటుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా సమర్ధవంతగా పనిచేయడం జరిగిందన్నారు. అనేక పరిశ్రమలు తెలంగాణకు వచ్చి పారిశ్రామిక ప్రగతి సాధించిందన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రమంగా రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో పడిపోతున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులు కేవలం దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపుచ్చుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో తిరిగి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. అలాగే ఉగ్రవాదంపై భారత సైన్యం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన ర్యాలీలో మాజీ మంత్రి దయాకర్రావు జాతీయ జెండా పట్టుకొని పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించేందుకు భారతసైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ రాజకీయాలను పక్కన బెట్టాలని కోరారు.