హనుమకొండ, జనవరి 25 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు దౌర్జన్యసభలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆడుతున్న జిమ్మిక్కులని విమర్శించారు. శనివారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి మాట్లాడారు. గ్రామసభల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ప్రజలు ఆశతో వస్తే మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు, కానీ ఇప్పటివరకు ఒక లబ్ధిదారుడిని ఎంపిక చేయలేదన్నారు.
అన్నింటా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, ఇందుకు నిదర్శనం గ్రామసభల్లో ప్రజలు నిలదీయడం, నిరసనలేనని చెప్పారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రుల మాటలకు పొంతన లేదని పేర్కొన్నారు. దావోస్ పెట్టుబడులు శుద్ధఅబద్ధమని, రేవంత్‌రెడ్డి మాటలు బోగస్ అని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయాలని చూస్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు ఉరికించి కొడతారని తెలిపారు. పోలీసులను, అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. టెక్స్టైల్ పార్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని అధికారులే అంటున్నారని పేర్కొన్నారు.