దేవరుప్పుల, ఎప్రిల్ 14 : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అంబేద్కర్ విగ్రహాష్కరణ చేయకుండా అడ్డుతగిలారు. తీవ్ర తోపులాట మధ్యలో దయాకర్ రావు ఎట్టకేలకు విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించగా ఎర్రబెల్లి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కాగా, జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డి, దేవరుప్పుల,కొడకండ్ల, పాలకుర్తి ఎస్సైలు, సిబ్బంది, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రోప్పార్టీతో పాటు 50 మంది పోలీసులు ప్రొటోకాల్ పేర అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం నుంచి మోహరించారు.
దీంతో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై నెలకొల్పిన ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రొటోకాల్ ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని పిలవాలని, ఎర్రబెల్లితో విగ్రహాన్ని ప్రారంభిస్తే నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని విగ్రహ కమిటీకి తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజు విగ్రహదాత మాజీ మంత్రి ఎర్రబెల్లితో విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని కమిటీ పట్టుబట్టడంతో అలా సాధ్యం కాదని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో విగ్రహ కమిటీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించగా, ఎర్రబెల్లి పూలమాల వేసి నివాళులర్పించారు.
అమాంతం ఎత్తుకుని..
కాగా ఎర్రబెల్లిని మెట్ల మీద నుంచి విగ్రహం వద్దకు వెళ్లేందుకు పోలీసుల నిర్బంధం ఎదుర్కొగా బీఆర్ఎస్ కార్యకర్తలు అమాంతం ఎత్తుకుని పైకి తీసుకెళ్లారు. దేవరుప్పులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ దళిత కమిటీ రూ.12 లక్షల ఖర్చుతో ఈ విగ్రహాన్ని రెండేండ్ల కింద ఏర్పాటు చేసింది. ఇందులో రూ.8 లక్షల వ్యయంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి కాంస్య విగ్రహాన్ని సమకూర్చారు. ఇతర దాతలతో విగ్రహ ఏర్పాటును పూర్తి చేశారు. నెలల తరబడి ఎన్నికల కోడ్ ఉండడం, ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులతో అనేక సార్లు విగ్రహ ప్రతిష్ఠాపన వాయిదా పడుతూ వస్తున్నది. అంబేద్కర్ జయంతి రోజు ఈ విగ్రహాన్ని ఎర్రబెల్లితో ప్రారంభించాలని విగ్రహ కమిటీ నిర్ణయించగా, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ప్రొటోకల్ నిబంధన ముందుకు తెచ్చి, ఇటు రెవెన్యూ, అటు పోలీసులపై ఒత్తిడి తేవడం ఈ ఉద్రిక్తతకు తెరలేచింది.
ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపట్టు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పులలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ప్రారంభించడానికి విగ్రహ కమిటీ తనను ఆహ్వానిస్తే పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు. ఎమ్మెల్యే మాటలు విని పోలీసులు ఇంత నిర్బంధాన్ని ఏర్పాటు చేయడం ఏంటి? ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేసిన తనను పోలీసులు బలవంతంగా నెట్టివేస్తున్నారు. లాగుతున్నారు. ఈ టార్చెర్ తాను ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఏసీపీ మాటను తాను జవదాటలే. వాళ్లు చెప్పినట్టే నడుచుకున్నా. అయినా పోలీసులు తనపై దాడి చేస్తున్నారు.
ఇదెక్కడి పద్ధతి. పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డి కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దేవరుప్పుల మండలంలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. రాజకీయ అనుభవం లేని వారి మాటలు వింటే మీరే ఆగమవుతారు. తాను మళ్లీ గెలుస్తాను. మంత్రి నవుతాను. తాను మంత్రిగా ఉన్న సమయంలో మీపై రాజకీయ ఒత్తిడి తెచ్చానా అని పోలీసులకు అడిగారు. పోలీసుల తీరు ఇకనైనా మారితే మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై, అంబేద్కర్ రాజ్యాంగంపై విశ్వాసం లేదన్నారు. సెక్రటేరియేట్ ముందు పెట్టిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్నే సీఎం రేవంత్రెడ్డి సీల్ చేసి పెట్టారని విమర్శించారు.