దేవరుప్పుల, ఫిబ్రవరి 27: కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట, దేవునిగుట్ట తండాల్లో గురువారం ఆయన పర్యటించగా, రైతులు తమ ఎండిన పొలాలను చూపించి పంటలు కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి పంటలు నీళ్లు లేక ఎండిపోగా జీవాలకు మేతగా వేస్తున్నారని తెలిపారు.
పంటపై ఆశ చావని రైతులు బోర్లు వేస్తూ ఇంకా అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు. దేవాదుల నీళ్లు వదిలితే ఇంత కష్టం ఉండకపోయేదన్నారు. నీళ్లుండి వదలలేని దుస్ధితి ఈ నియోజకవర్గంలో ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నవాబుపేట, స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ల నుంచి యాసంగి పంటకు నీళ్లు వదిలేదని గుర్తుచేశారు. సాగునీటి అధికారులకు ఎప్పుడు ఫోన్ చేసినా రెండు రోజుల్లో నీళ్లు వదులుతామని చెబుతున్నారే తప్ప వదలడం లేదన్నారు.
ఏ ఊరుకు పోయినా మళ్లీ కేసీఆర్ సారే రావాలని అంటుండ్రని తెలిపారు. స్థ్ధానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు దండుకుని, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తుండ్రని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పేర్కొన్నారు.