జనగామ, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘దీపావళికి ముందు రాష్ట్రంలో బాంబులు పేలుతాయ్’ అంటూ చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. ఆ బాంబులు పేలేది కాంగ్రెస్ పార్టీలోనే.. ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం పడిపోనుంది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న లకావత్ శ్రీనునాయక్ కుటుంబానికి మద్దతుగా శనివారం జనగామ జిల్లా పాలకుర్తి చౌరస్తాలో గిరిజనులు చేపట్టిన మహాధర్నాలో ఎర్రబెల్లి, మాజీ మంత్రి సత్యవతి, శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీనియర్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గండం పొంచి ఉన్నదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు పదవీ గండం తప్పదని జోస్యం చెప్పారు. 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నాయిని రాజేందర్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. సాక్షాత్తు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటని అన్నారు.
సీఎం రేవంత్‌కు ఇప్పటికే ఏడుసార్లు ఢిల్లీలో సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని పేర్కొన్నారు. రేవంత్.. రాహుల్ డైరెక్షన్లో పనిచేయడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్, పొంగులేటి.. ముందు మీ కుర్చీలు కాపాడుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. లకావత్ శ్రీను నాయక్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేని ఆయన పేర్కొన్నారు. శ్రీను మరణానికి కారణమైన సీఐ, ఎస్సై, కాంగ్రెస్ నాయకులపై వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతుందని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును పాలకుర్తి ఆందోళనకు తీసుకువస్తానని స్పష్టంచేశారు.
ఆ బాంబులు మీ మీదనే పడతాయి..
‘బాంబుల సంస్కృతి కాంగ్రెస్ నాయకులకే అలవాటు. ఆ బాంబులు మీ మీదనే పడి మీరే చస్తారు.. అధికారం కోసం మీలో మీరే కొట్టుకొని చస్తారు’ అని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులే విమర్శించడం సిగ్గుచేటన్నారు. మండలిలో ప్రతిపక్షనేత మధుసూధనచారి మాట్లాడుతూ.. శ్రీనునాయక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పాలకుర్తిలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే రోజులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. 10 నెలల ముందు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారినట్టు ఆరోపించారు. అభివృద్ధికి అర్థం తెలియని కాంగ్రెస్ పార్టీ ఏ ఒక హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడితే ఊరుకునేది హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ లకావత్ శ్రీను నాయక్ది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.