జనగామ: పేద ఇంటి ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో బతుకమ్మ చీరేల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే ప్రజల పండుగలని నిర్వహిస్తున్నదని అన్నారు.
రూ. 333 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లె, అమ్మకు చీరెలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డామని అన్నారు. ’’రాష్ట్ర ఆదాయం లేదు, అన్ని వ్యవస్థలు బంద్ అయి, ఒకరినొకరు పలకరించే పరిస్థితి లేకుండా అయింది‘‘ అని దయాకర్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇన్ని సంక్షేమ పధకాలు లేకపోయినా, కరోనా సమయంలో సంక్షేమ పధకాలను అమలు చేయలేదని గుర్తుచేశారు. కానీ, పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి మాత్రం కష్టకాలంలో అప్పు తెచ్చి మరీ, పేదలకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి ఇచ్చారని చెప్పారు.
కరోనా సమయంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు, 50 లక్షలు ఖర్చు పెట్టి ఆనందయ్య మందు ఇంటింటికి అందజేసినట్లు ఆయన తెలిపారు. 40 వేల కోట్లు ఖర్చుపెట్టి గోదావరి నీటిని శుద్దిచేసి ఇంటింటికి నల్లా ద్వారా అందజేస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ఆసరా పెన్షన్లు రూ.రెండు వేల పదహారుకు పెరగగా, ఇంటిలో పెద్ద వారికి గౌరవం పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్లు కూడా కట్టి ఇచ్చే పధకం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ ఇంటింటికి ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన ఆయన.. వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వచ్చినా ప్రాణాపాయం ఉండదని, త్వరగా తగ్గిపోతుందని వివరించారు. జిల్లాలో 3 లక్షల మందికి మొదటి డోసులు, 80 వేల మందికి రెండు డోసులను ఇప్పటికే ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో 2 లక్షల చీరెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 8 కోట్ల 50 లక్షలు ఉంటుందని చెప్పారు. 24 డిజైన్లు, 810 రంగులతో చీరెలు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మను అందరూ సంబరంగా జరుపుకోవాలన్నారు.
కార్యక్రమానికి ముందు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి మంత్రి, కలెక్టర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రిపై మహిళలు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. బతుకమ్మలతో, డప్పులు, మేళతాళాలతో సంప్రదాయ బద్దంగా ఎదురేగారు. మంత్రి, జిల్లా కలెక్టర్ బతుకమ్మ ను ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డీఆర్డీవో జి. రాంరెడ్డి, జెడ్నీ సీఈవో ఎల్. విజయలక్ష్మి, డీపీవో కె. రంగాచారి, ఏడీ హ్యాండ్లూమ్ ఎస్. కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.