హనుమకొండ సబర్బన్, మార్చి 23 : అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట పరిధిలో నిర్మించిన పంప్‌హౌస్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 5 లక్షల 57 వేల ఎకరాల్లో రెండు పంటలకు నీళ్లు వచ్చేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. దేవాదుల మూడో దశ కింది రూ.1494 కోట్లతో రామప్ప నుంచి ఉనికిచర్ల వద్దకు టన్నెల్‌ను పూర్తి చేశారని తెలిపారు. 15 నెలలుగా పనులు సాగకపోవడం తో రైతాంగం తీవ్ర నష్టం చూడాల్సి వచ్చిందన్నారు.
కేవలం రూ. ఆరు కోట్లు విడుదల చేయకపోవడంతో 34 రోజుల పాటు ఓఅండ్ఎం స్టాఫ్ స్ట్రయిక్ చేస్తే రైతులు రూ. 600 కోట్లు నష్టపోయారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చివరికి అధికారులు, మంత్రితో మాట్లాడితే రూ.6 కోట్లు విడుదల చేయగా పంపులు నడిచాయని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు బలోపేతానికి కేసీఆర్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టును నిర్మించి 365 రోజుల పాటు సాగు నీరు అందిస్తే, ఈ చేతకాని సర్కారు వల్ల రైతాంగం నష్టపోయిందని తాటికొండ రాజయ్య మండిపడ్డారు.