దేవరుప్పుల, ఆగస్టు 18: రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. రుణమాఫీని ఎగ్గొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హుల్లో కేవలం 47 శాతం మందికే రుణమాఫీ జరిగిందని తెలిపారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్కల్లో రూ.49,500 కోట్ల అప్పులు ఉన్నట్టు తేలగా, క్యాబినెట్ మీటింగ్లో రూ.31 వేల కోట్లని తేల్చి, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి, తీరా మూడు విడుతల్లో రూ.17 వేల కోట్లకే రుణమాఫీ చేశారని చెప్పారు. రుణమాఫీ కాని లక్షలాది మంది రైతులు రోడ్డెక్కితే ఈ ప్రభుత్వం ఉంటుందా? అని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో చెప్పలేమని తేల్చి చెప్పారు. సమావేశంలో జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.