పాలకుర్తి, సెప్టెంబర్ 3 : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా కేసీఆర్‌పై కేసు పెడితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పీసీ ఘోష్ నివేదిక బూటకమని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కన్నబిడ్డ అని చూడకుండా కేసీఆర్ కవితను సస్పెండ్ చేసినట్టు చెప్పారు.
కవిత మాటల వెనుక కాంగ్రెస్ ఉన్నదని ఆరోపించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. అందుకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీలతో కేసులు వేయించినట్టు విమర్శించారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కేసు వేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావును తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లంబాడాల మీద కోపంతోనే రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఇప్పటి వరకు గిరిజనులకు చోటుకల్పించలేదని ఆరోపించారు. ఎస్టీల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి వారిని మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఎస్టీలు ఉరికించి కొడతారని హెచ్చరించారు.